జాతీయగీతం మార్చిన వర్మ!
జాతీయ గీతం 'జన గణ మన అధినాయక జయహే' వరుసను మారుస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సాహాసానికి దిగారు. సరికొత్త వివాదానికి తెరతీశారు. పరిటాల రవి జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ రెండు భాగాలుగా 'రక్త చరిత్ర' చిత్రాన్ని త్వరలో తెరకెక్కించబోతున్న వర్మ ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'రణ్' అనే చిత్రాన్ని శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇండియాలోని ప్రసార మాధ్యమాల పోకడపై ఈ చిత్రాన్ని ఆయన ఎక్కుపెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రితీష్ దేశ్ ముఖ్, మనీషా కొయిరాలా, గుల్ పనాగ్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో 'జన గణ మన' గీతం బాణీని మార్చకుండా 'జన గణ మన రణ్ హై...' అంటూ పాడించారు. పాట మొత్తం చాలా మార్పులకు గురైంది.
దీనిపై వర్మ వివరణ ఇస్తూ, రిలిక్స్ ద్వారా తన భావాలను మాత్రమే వ్యక్తీకరించాననీ, జాతీయ గీతాన్న ఏమాత్రం కించపరచే ప్రయత్నం జరగలేదనీ తెలిపారు. జాతీయ గీతం మ్యూజిక్ ను ఉపయోగించుకునే విషయంలో తగిన లీగల్ ప్రొడక్షన్స్ కూడా తీసుకున్నట్టు వివరించారు. పాటను ఎందుకు అలా మార్చుచేర్పులు చేయాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. జాతీయ గీతాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలనే వర్మ ఐడియాను జనం ఆమోదిస్తారా? లేక కందిరీగ తుట్టెను ఆయన కదలించినట్టవుతుందా అనేది వేచిచూడాల్సి ఉటుంది. మధు మంతెన ('గజనీ' ఫేమ్) ఈ చిత్రానికి నిర్మాత.
News Posted: 7 May, 2009
|