తమన్నాకు మణిరత్నం ఛాన్స్?
ఇండియాలోని టాప్-10 దర్శకులలో ఒకరైన మణిరత్నం చిత్రంలో కనీసం చిన్న పాత్రలోనైనా నటించే అవకాశం వస్తే కొత్త హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకూ ఎగిరి గంతేస్తుంటారు. యువతరం ప్రేక్షకులను తన గ్లామర్ తో అలరిస్తున్న తమన్నా ఇప్పుడు అలాంటి అరుదైన ఛాన్స్ నే అందిపుచ్చుకుంది కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మణిరత్నం ప్రస్తుతం అభిషేక్, ఐశ్వర్యారాయ్, విక్రమ్, ప్రియమణి తదితరులతో హిందీ, తమిళ భాషల్లో 'రావణ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం ఇప్పుడు పూర్తి స్వస్థత పొంది తిరిగి ఆ చిత్రం షూటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీలంకలో తదుపరి షెడ్యూల్ ఉన్నందను అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో 'రుక్మిణి' అనే పేరుతో తన తదుపరి చిత్రానికి కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషించనుందని సమాచారం.
నాలుగేళ్ల క్రితం మంచు మనోజ్ సరసన 'శ్రీ' చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన తమన్నా ఇటీవల 'హ్యాపీడేస్' చిత్రంతో ఒక్కసారిగా యువ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇదే తరుణంలో తమిళంలోనూ మంచి డిమాండ్ ను సంపాదించుకుంది. 'పడిక్కాదవన్', 'అయన్' (తెలుగులో 'వీడొక్కడే') చిత్రాలతో పాటు ఆస్కార్ బ్యానర్ పై ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన 'ఆనంద తాండవం' చిత్రం కూడా ఆమెను ద్విభాషా నటిగా బిజీ చేసింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తూ, తెలుగులో సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మణిరత్నం 'రుక్మిణి'లో తమన్నా నటించనుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మణి మాత్రం ఇంకా హీరోయిన్ ను ఫైనలేజ్ చేయలేదట. మణి సినిమాలో తమన్నాకు అవకాశం దక్కితే మాత్రం ఆమె కెరీర్ కు మరో మంచి బ్రేక్ దొరికినట్టే.
News Posted: 11 May, 2009
|