రజనీ సిక్స్ ప్యాక్
మొన్న అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్...నిన్న సూర్య...అంతకుముందు స్టయిలిష్ హీరో అల్లు అర్జున్, నితిన్...ఇలా సిక్స్ ప్యాక్ బాడీతో వీరంతా సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బుర పరిచారు. ఇప్పుడు తమిళ స్టార్ రజనీకాంత్ వంతు వచ్చింది. రజనీ వయసును బట్టి అదెలా సాధ్యం అంటారా? అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'సుల్తాన్- ది వారియర్' యానిమేషన్ చిత్రం కోసం రజనీ సిక్స్ ప్యాక్ అవతారం ఎత్తబోతున్నారు. ఇందుకు అవసరమైన లుక్ కోసం హాలీవుడ్ లోని పలువురు బెస్ట్ టెక్నీషియన్లయిన అహరహం శ్రమిస్తున్నారు. ఈ చిత్రానికి సౌందర్య తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్కంగా ఈ యానిమేటెడ్ చిత్రం తెరకెక్కుతోంది.
రజనీ సూపర్ మాన్ లా ఇందులో కనిపించనున్నారా? ఎంతమాత్రం కాదని సౌందర్య చెబుతున్నారు. ఆయన ఆకాశంలో ఎగురబోవడం లేదనీ, సుల్తాన్ ఒక వారియర్ అనీ, చోళుల కాలంనాటి కథాక్రమంతో ఈ సినిమా ఉంటుందనీ చెప్పారు. ప్రేమ, వంచన, ప్రతీకారం, యాక్షన్, హ్యూమర్ వంటి అన్ని అంశాలు మేళవించిన కమర్షియల్ చిత్రమిదని తెలిపారు. రజనీ మార్క్ పంచ్ డైలాగ్ లకూ ఇందులో కొదవలేదనీ, 'సుల్తాన్ గాలికి ఎగిపోయే ఆకు కాదు. ఓ పర్వతం. చెక్కుచెదరడు' వంటి సంభాషణలు ఇందులో ఉంటాయనీ ఆమె చెప్పారు. ఆసక్తికరంగా రజనీకి ఈ సంభాషణలు అందించిన క్రెడిట్ కూడా సౌందర్యదే. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుంది. జపాన్, ఆంగ్ల వెర్షన్లలోనూ ఆయా దేశాల్లోని థియరీటికల్ రిలీజ్ నిబంధనలను అనుగుణంగా విడుదల చేస్తారు. తన తండ్రికి ఒక కూతురిగా తాను ఇవ్వబోయే విలువైన కానుకే ఈ 'సుల్తాన్' చిత్రమనీ, క్లాస్ ప్రోడక్ట్ గా దీనిని తీర్చిదిద్ది దీపావళి కానుకగా అందిస్తానని సౌందర్య తెలిపారు. అంటే దీపావళి రిలీజ్ గా 'సుల్తాన్' ఉంటుందనుకోవచ్చా? ఇందుకు సౌందర్య సమాధానం కూడా రెడీగానే ఉంది. దీపావళికి కావచ్చు..న్యూ ఇయర్ కు కొద్దిగా ముందుగా ఇచ్చే గిఫ్ట్ కూడా కావచ్చు..అంటూ నవ్వుతూ చెప్పారామె.
News Posted: 12 May, 2009
|