షారూక్ 'హ్యాపీ న్యూ ఇయర్'
షారూక్ ఖాన్ కథానాయకుడిగా ప్రముఖ కొరియాగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ తలపెట్టిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం ఇప్పట్లో వెలుగుచూసే అవకాశాలు లేవనే వదంతులకు ఎట్టకేలకు తెరపడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ, ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్నందున అది పూర్తి కాగానే సినిమా మొదలవుతుందనీ ఫరాఖాన్ వివరణ ఇచ్చారు. 'ఏదిఏమైనా నిశ్చయంగా ఈ ఏడాదే సినిమా ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31న హ్యాపీ న్యూ ఇయర్ సంబరాల్లోనే ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నాం' అని ఆమె తెలిపారు.
ఇప్పట్లో 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ఉందడంటూ కొందరు బాధ్యతారాహిత్యమైన వదంతులు పుట్టిస్తున్నారనీ, అసలు ఇలాంటి వదంతులు ఎలా పుడతాయో షారూక్ కు గానీ, తనకు గానీ అర్థం కావడం లేదనీ ఆమె అన్నారు. 'మై హు న' (2004). 'ఓం శాంతి ఓం' చిత్రాల తర్వాత షారూఖ్ తో హ్యాట్రిక్ ఫిల్మ్ గా ఫరా చేపడుతున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాన్ని సైతం షారూక్ సొంత సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అమీర్ ఖాన్ నటించిన 'జో జీతా వో సికిందర్' (1992) చిత్రం ద్వారా ఫరాఖాన్ కొరియోగ్రాఫర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'దిల్ తో పాగల్ హై', 'కహో న ప్యార్ హై', 'దిల్ చాహతా హై', 'మాన్సూన్ వెడ్డింగ్', 'కభీ ఖుషీ కభీ గమ్', 'క్రిష్', 'కభి అల్విదా న కెహనా', 'దోస్తానా' వంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆమె కొరియోగ్రఫీ అందించారు. ఐదుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 'కోయీ మిల్ గయా' చిత్రంలో హృతిక్ నటించిన 'ఇదర్ చలా మై' పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 2004లో జాతీయ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
News Posted: 14 May, 2009
|