అరుణ్ జైట్లీకి వర్మ కేసు
రామ్ గోపాల్ వర్మ విజయ రహస్యానికి ఆయనకున్న చురుకైన ఆలోచనా దృక్పథం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 'రణ్' టైటిల్ ట్రాక్ కోసం 'జన గణ మన అధినాయక జయహే' గీతాన్ని 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేయడంపై సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతరాలపై వర్మ చురుకుగా పావులు కదుపుతున్నారు. చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఈ పాటకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ను అనుమతించేది లేదని ఇటీవల సెన్సార్ బోర్డు తేల్చిచెప్పడంతో న్యాయపోరాటానికి వర్మ సిద్ధమవుతున్నారు. సెన్సార్ బోర్డు రూలింగ్ పై తొలుత హైకోర్టును ఆశ్రయించాలని భావించిన వర్మ కాలయాపన లేకుండా ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించబోతున్నారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై వర్మ పోరాటానికి ప్రముఖ న్యాయవాది, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ సహకారాన్ని వర్మ కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
'వర్మ కేసును అరుణ్ జైట్లీ హ్యాండిల్ చేయబోతున్నారు. దీనిపై ఇరువురూ చర్చించారు. వర్మకు సహకరించేందుకు జైట్లీ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు' అని ఆ వర్గాలు తెలిపారు. ఈ విషయాన్ని వర్మ సైతం ధ్రువీకరిస్తూ, సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనను అరుణ్ జైట్లీకి అప్పగించనున్నామని చెప్పారు.
News Posted: 16 May, 2009
|