న్యూడ్ ఫోటోలపై సెలీనా గుస్సా
బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచురించారనే అభియోగంపై రెండు వెబ్ సైట్లపై ముంబై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వీటిలో ఒకటి బాలీవుడ్ వెబ్ సైట్ కాగా, మరొకటి విదేశీ వెబ్ సైట్. తన ఫోటోలను మార్ఫ్ చేసి, అశ్లీలంగా, తన ప్రతిష్టను భంగం కలిగించేలా ప్రచురించినట్టు సెలీనా మండిపడింది.
ఏడాదిన్నర క్రితం ఓ ఫోటో షూట్ లో తాను పాల్గొన్నప్పటి ఫోటోలను ఆ వెబ్ సైట్ మార్ఫ్ చేసి ఇప్పుడు ప్రచురించిందనీ, నిజానికి ఫోటో షూట్ మధ్యలోనే తాను వైదొలిగాననీ, అయితే ఆ ఫోటోలు ఇంతవరకూ తనకు ఇవ్వకపోవడమే గాకుండా వాటిని మార్ఫ్ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారనీ సెలీనా ఆరోపించింది. సదరు వెబ్ సైట్ లో సెలీనా పాంటీస్ పైన 'స్లైడ్ టు అన్ లాక్' అనే పదాలు కూడా ప్రింట్ చేయడం ఆమెను మరింత ఆవేదనకు గురిచేసిందని తెలుస్తోంది. సెలినా ఇమేజ్ కు భంగం కలిగించేలా మార్ఫ్, అప్ లోడింగ్ కు పాల్పడిన వారిపై పోలీసులు తక్షణం చర్య తీసుకుంటారని తాము భావిస్తున్నట్టు ఆమె తరఫు పబ్లిసిస్ట్ పరాగ్ దేశాయ్ తెలిపారు. తన ఫోటోలు దుర్వినియోగం చేస్తూ, మార్ఫ్ చేసినట్టు సెలీనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని జాయింట్ పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా ధ్రువీకరించారు. సెలీనా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సైబర్ సెల్ టీమ్ దర్యాప్తు జరుపుతుందని చెప్పారు. అయితే ఆ వెబ్ సైట్ల పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
News Posted: 18 May, 2009
|