రణ్ బీర్ కు జోడిగా మాధురి?
వయసు మళ్లిన హీరోలతో పడుచు అమ్మాయిలు జోడి కట్టడం బాలీవుడ్ లో కొత్తేమీ కాదు. 'దీవానీ'లో రిషికపూర్, 'సూర్యవంశ్' లో అమితాబ్ బచ్చన్, ఈమధ్యనే 'ఓం శాంతి ఓం', 'రబనే బనా ది జోడి' చిత్రాల్లో షారూక్ ఖాన్ తమకంటే వయసు తక్కువున్న కుర్ర హీరోయిన్లతో స్క్రీన్ రొమాన్స్ పండించారు. అయితే సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోలతో జత కట్టడం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. ఇప్పుడు అలాంటి అరుదైన కాంబినేషన్ కు ఫిల్మ్ మేకర్ ప్రకాష్ ఝా శ్రీకారం చుడుతున్నట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో కపూర్ ఫ్యామిలీ యువహీరో రణ్ బీర్ కపూర్ కు జోడిగా సీనియర్ నటి మాధురీ దీక్షిత్ నటించనుందని సమాచారం.
బాలీవుడ్ లో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించిన మాధురి దీక్షిత్ గతంలో ప్రకాష్ ఝా తీసిన 'మృత్యుదండ్' (1997) చిత్రంలో నటించింది. వివాహానంతరం అమెరికాలో స్థిరపడిన మాధురి ఇటీవల యష్ రాజ్ ఫిలిమ్స్ 'ఆజే నాచ్ లే' చిత్రంతో మళ్లీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినా తన ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదని మాధురి నిరూపించుకుంది. రణ్ బీర్ తండ్రి రిషికపూర్ తోనూ మాధురి 'యారానా', 'ప్రేమ్ గ్రంథ్' చిత్రాల్లో గతంలో నటించింది. ఇప్పుడు రణ్ బీర్ తోనూ నటిస్తే తండ్రీకొడుకులకు జోడిగా నటించిన క్రెడిట్ మాధురికి దక్కుతుంది. వయసు మళ్లిన హీరోయన్, వయసులో ఉన్న హీరో కలిస్తే వారిద్దరి మధ్యా స్క్రీన్ మ్యాజిక్ సాధ్యమేనా? సాహిద్ కపూర్-విద్యాబాలన్, రణ్ బీర్ కపూర్-బిపాసాబసుల కాంబినేషన్ విజయవంతమైనప్పుడు ఇప్పుడు ఎందుకు కాదు? ఏమి జరుగుతుందో చూద్దాం...
News Posted: 18 May, 2009
|