సంకెళ్లు కాదు షేక్ హ్యాండే!
'నిన్న హైయెస్ట్ టేక్స్ పేయర్ అంటూ నన్ను పైకెత్తేస్తారు. ఇప్పుడేమో నన్ను పోలీసులు అరెస్టు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు' అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మీడియా వార్తలపై కళ్లనీళ్ల పర్వంతమవుతున్నారు. గత నెలలో జరిగిన 'లక్మే ఫ్యాషన్ వీక్'లో పాల్గొన్న అక్షయ్ డయాస్ నుంచి ప్రేక్షకుల గ్యాలరీ వద్దకు నేరుగా వచ్చి తన భార్య ట్వింకిల్ తో ఫ్యాంట్ బటన్ తీయించిన సంఘటన దుమారం రేపింది. పబ్లిక్ లో 'అశ్లీల' ప్రవర్తనకు పాల్పడ్డారంటూ అక్షయ్ దంపతులపైన, నిర్వాహకులపైన అనిల్ నాయిర్ అనే వ్యక్తి కేసు పెట్టారు. నెలరోజులుగా విదేశాల్లో షూటింగ్ లో ఉన్న అక్షయ్ గత ఆదివారం రాత్రి ముంబై చేరుకోవడంతో సోమవారం ఉదయం అతన్ని పోలీసులు అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. అక్షయ్ అరెస్టు వార్త సినీవర్గాల్లో సంచలనం రేపింది. అయితే ఇది ఎంతమాత్రం అరెస్టు కాదనీ, తాను ఐచ్ఛికంగానే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనీ అక్షయ్ వెల్లడించారు.
'ఇదెంతమాత్రం అరెస్టు కాదు. గత నెలలో జరిగిన సంఘటనకు సంబంధించిన నేను ముంబైలో లేనప్పుడు కొంత గందరగోళం తలెత్తిన విషయం నా దృష్టికి వచ్చింది. కొంత పేపర్ వర్క్ ను పోలీసులకు అందజేయాల్సిన అవసరం ఉండటంతో స్టేషన్ కు వెళ్లాను. అక్కడి సిబ్బందిని గ్రీట్ చేసి వారితో కరచాలనం చేశాను. ఎంత హుందాగా వారిని కలుకున్నానో అంత హుందాగానూ బయటకు వచ్చాను' అని అయన వివరించారు. ఈ సంఘటనను తాను పట్టుబడటం గానో, లొంగిపోవడం గానో, హీరోయిజం చూపించడం గానో అభివర్ణించడం తగదని అన్నారు. పోలీసులను తాను ఫార్మల్ గా మాత్రమే కలుసుకున్నాని చెబుతూ 'అక్కడేమీ సంకెళ్లతో స్వాగతం పలక లేదు. సంకెళ్లు వేయనూ లేదు. కరచాలనాలు మాత్రమే మామధ్య చేటుచేసుకున్నాయి' అంటూ అక్షయ్ ఆవేదనగా చెప్పారు.
News Posted: 20 May, 2009
|