కేట్ విన్సెలెట్ తో అమీర్
బ్రిటీష్ ఇండియా కాలం నాటి విలేజర్ గా 'లగాన్'లోనూ, డెస్లిక్సిక్ టీచర్ గా 'తారే జమీన్ పర్', షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న వ్యక్తిగా 'గజనీ'లోనూ ప్రతిభావంతమైన నటన ప్రదర్శించిన అమీర్ ఖాన్ ఇప్పుడు మతిస్థిమితం లేని యువకుడి పాత్రలో నటించబోతున్నారట. అంతేనా? ఆస్కార్ విన్నర్ కేట్ విన్సెలెట్ తో కలిసి ఆయన నటించబోతున్నారు. ఇండియా-పాకిస్థాన్ విభజన కాలం నాటి కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందట. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వర్గాల నుంచి ఈ తాజా కథనం బయటకు వచ్చింది.
కేన్స్ వర్గాల కథనం ప్రకారం...సాదత్ హసన్ మంటే రాసిన 'టోబ టెక్ సింగ్' అనే కథ ఆధారంగా దర్శకుడు పాన్ నలిన్ ఈ చిత్రాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1947లో దేశవిభజన కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో లాహోర్ లోని ఓ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఇందులో మతిస్థిమితం తప్పిన యువకుడిగా అమీర్ ను అనుకుంటున్న పాన్ నలిన్ కీలకమైన డాక్టర్ సోఫియా పాత్రకు కేట్ విన్సెలెట్ ను ఒప్పించాలని అనుకుంటున్నారు. అమీర్, కేట్స్ ను సంప్రదించి నటీనటులను ఫైనలైజ్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నారు. అమీర్ తరహాలోనే విలక్షణ పాత్రల పోషణలో కేట్స్ కు ప్రత్యేకత ఉంది. టైటానిక్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్, లిటిల్ చిల్ట్రన్, రివల్యూషనరీ రోడ్, ది రీడర్ వంటి చిత్రాల్లో ఆమె నటనే ఇందుకు నిదర్శనం. ఇక అమీర్ సైతం కొద్దికాలంగా హాలీవుడ్ చిత్రంలో నటించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. పాన్ నలిన్ తయారు చేస్తున్న స్క్రిప్టు అమీర్ ను సైతం ఆకట్టుకుందనీ, ఇందులో కీలకమైన బిషన్ సింగ్ పాత్రను పోషించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారనీ కేన్స వర్గాలు చెబుతున్నాయి. అమీర్-కేట్ జంటతో ఈ ప్రాజెక్ట్ ఖరారైతే ఇక సంచనలనాకు కొదవుండదు.
News Posted: 22 May, 2009
|