ట్రిబ్యునల్ కు 'రణ్' వ్యవహారం
న్యూఢిల్లీః రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'రణ్' విషయంలో సెన్సార్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సినిమాటోగ్రఫీ చట్టాల కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆదేశించింది. దీంతో 'రణ్' సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ జరుపుతున్న పోరాటం మరో మలుపు తిరిగింది.
'రణ్' సినిమాలో జాతీయ గీతమైన 'జన గణ మన అధినాయక జయహే'ను 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేయడంపై సెన్సార్ (సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ) అభ్యంతరం తెలియజేసింది. ఆ పాటను తొలగించాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే ఇందుకు వర్మ నిరాకరించారు. ఇవాల్టి సమాజంలోని వాస్తవిక పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఈ పాటను చిత్రీకరించామనీ, ఇదెంతమాత్రం జాతీయగీతం ప్రతిష్ఠను దిగజార్చే చర్చ కాదనీ ఆయన తన వాదనను బలంగా వినిపిస్తూ వచ్చారు. సెన్సార్ నిర్ణయంపై ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన వెకేషన్ బెంచ్ జడ్జి వి.ఎస్.సర్పూకర్ సోమవారంనాడు తాజా ఆదేశాలను జారీ చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తున్న వర్మ పిటిషన్ పై నెలరోజులు లోగా నిర్ణయం వెల్లడించాలంటూ ఆయన ట్రిబ్యునల్ కు సూచించారు. ఒకవేళ ఆ నిర్ణయంపై వర్మ సంతృప్తి చెందకపోతే నెల తర్వాత తమ దృష్టికి తీసుకురావాలని కూడా బెంచ్ వర్మకు సూచించింది.
News Posted: 25 May, 2009
|