జాతీయగీతానికి వర్మ వక్రభాష్యం
అమితాబ్ కథానాయకుడుగా త్వరలో విడుదలకానున్న 'రణ్' చిత్రంలో జాతీయ గీతాన్ని వక్రీకరించిన ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సుప్రీంకోర్డు ఆగ్రహాన్ని చవిచూశారు. 'జన గణ మణ రణ్ హై' అంటూ సాగే పాటకు అనుమతించేది లేదంటూ సెన్సార్ బోర్టు నిరాకరించడాన్ని వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్, ఆర్.ఎం.లోథాలతో కూడిన వెకేషన్ బెంచ్ సెన్సార్ బోర్డు ఆదేశాలు కొట్టివేసేందుకు నిరాకరించింది. 'జాతీయ గీతంలోని ప్రతి లైన్ వక్రీకరించి ప్రతికూల అర్ధాన్ని ఇచ్చేలా ఈ చిత్రంలోని సాంగ్ ఉంది. జాతీయ గీతాన్ని వక్రీకరించే హక్కు ఎవ్వరికీ లేదు' అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
'రణ్ ' చిత్రంలోని సాంగ్ ప్రమోషన్ కు ఈనెల 8న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిరాకరించింది. ఈ పాట జాతీయ చిహ్నాలు, పేర్లను వక్రీకరించరాదనే (ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూస్) 1950 చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అయితే సెన్సార్ చర్య తన ఆలోచనలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనంటూ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు టీవీ ఛానెల్స్ సైతం ఈ సాంగ్ ప్రమోను ప్రసారం చేయడానికి నిరాకరించాయి. వోడాఫోన్ సైతం తమ నెట్ వర్క్ లో కాలర్ ట్యూన్ గా ఈ సాంగ్ ను అప్ లోడ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న విపత్తుల నుంచి జనాలను జాగృతం చేయడానికి ఉద్దేశించిన దేశభక్తి గీతమిదని వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్.సి.పి., తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు తమ గుర్తులతో పాటు త్రివర్ణ పతాకాన్ని కూడా వాడుకుంటున్నాయని వర్మ తరఫు న్యాయవాది అరుణ్ జైట్లీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నందున డిస్ట్రిబ్యూషన్ విషయంలో జాప్యం జలెత్తకుండా చూడాలంటూ జైట్లీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసలు వర్మ మొదట్లోనే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ కు ఎందుకు వెళ్లలేదని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కంటే ముందు హైకోర్టును వెళ్లకపోవడం పట్ల కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వర్మను అప్పిలేట్ ట్రిబ్యూనల్ కు వెళ్లాలని సూచిస్తూ, వర్మ అప్పీల్ పై నెలరోజులు లోగా ట్రిబ్యునల్ తన నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది.
News Posted: 26 May, 2009
|