రేఖకు 'లైఫ్ టైమ్' ఇబ్బంది!
జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్) ఎంతమందికి దొరుకుతుంది? ఏ రంగంలో ఉంటున్న వారు ఆ రంగంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందినప్పుడే ఇందుకు అర్హులవుతారు. ఇప్పుడు ఆ అరుదైన అవకాశం బాలీవుడ్ సీనియర్ నటి, వయసు పైబడుతున్నా వన్నె తరగని రేఖను వరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న 'రాజ్ కపూర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్'కు రేఖను ఎంపిక చేసింది. ఆసక్తికరంగా ఇప్పుడు ఈ అవార్డు పేరులో మార్పు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. రేఖ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఈ మార్పు చేయడం విశేషం.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు రేఖకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా 'లైఫ్ టైమ్' అనే పదం ఆమెను ఇరకాటంలో పెట్టిందట. సహజంగా లైఫ్ టైమ్ అవార్డులను సీనియర్ నటీనటులకు వారి సేవల గుర్తింపుగా ఇస్తుంటారు. ముఖ్యంగా కెరీర్ చివరిదశలో ఉన్నవారికి, రిటైర్డ్ ఆర్టిస్టులకు ఈ అవార్డులు లభిస్తుంటాయి. వయసు పైబడిన నటిగా అనిపించుకోవడానికి రేఖ అంత సముఖంగా లేరనే విషయాన్ని ప్రభుత్వం సానుభూతితో అర్ధం చేసుకుందని అనుకోవచ్చు. 'రేఖ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని అవార్డు పేరులో మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకపూర్ ప్రతిభా గౌరవ్ పేరుతో ఈ అవార్డును రేఖకు అందజేయబోతున్నాం' అని సోమవారంనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. రేఖ ఇప్పుడు 55వ వసంతంలోకి అడుగుపెట్టింది.
News Posted: 26 May, 2009
|