కుర్రహీరో ప్రేమలో సోనమ్?
బాలీవుడ్ సోయగాల చిన్నది సోనమ్ కపూర్ ఇప్పుడు ఓ నూనుగు మీసాల కుర్రాడితో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇంతకూ ఆ కుర్రాడు ఎవరో కాదు. 'ఢిల్లీ-6' చిత్రంలో ఫోటోగ్రాఫర్ సురేష్ గా నటించిన విజె సైరుస్ షాహుకార్. ఆ చిత్రంలో సోనమ్ పై సైరుస్ ప్రేమను చిత్ర కథానాయకుడు అభిషేక్ బచ్చన్ దక్కించుకుని ఉండొచ్చు. అయితే రీల్ లైఫ్ లో మాత్రం సోనమ్ మనసును సైరుస్ దోచుకున్నారనీ, ఆ సినిమా షూటింగ్ లోనే ఆ ఇద్దరి మధ్యా స్నేహం చిగురించి ఇప్పుడు ప్రేమ చిగురులు తొడగడం మొదలుపెట్టందనీ బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు 'అయేషా' అనే చిత్రంలో నటిస్తున్నారు. జాన్ ఆస్టిన్ క్లాసిక్ 'ఎమ్మా' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనమ్ తండ్రి అనిల్ కపూర్ నిర్మిస్తుండటం విశేషం.
కొద్దిరోజులుగా సోనమ్, సైరుస్ ఒకరినొకరు వదులుకోలేనంత దగ్గరగా కనిపిస్తున్నారనీ, 'ఢిల్లీ 6' తర్వాత వారి మధ్య స్నేహం మరింత బలపడిందనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రేమజంట తరచు కలిసే బయటకు వెళ్తున్నారనీ, ఓ సబర్బన్ రెస్టారెంట్ ఇటీవల ప్రేమగీతాలు పాడుకోవడం పలువురి దృష్టిలో పడిందనీ వారు అంటున్నారు. ఈమధ్యనే సైరుస్ సైతం ఓ ఇంటర్వ్యూలో సోనమ్ గురించి మాట్లాడుతూ, గత జన్మలో ఆమె నాకు వైద్యురాలు అయివుండవచ్చనీ, నేను కాస్త తగ్గినట్టు కనిపిస్తే నాలో చోదకశక్తిని రగిలిస్తుందనీ చమత్కరించారు. సైరుస్ 'ఢిల్లీ 6' కంటే ముందు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా 'రంగ్ దే బసంతి'లోనూ నటించారు. షరామామూలుగానే సైరుస్ తో ప్రేమలో పడినట్టు వస్తున్న వార్తలను సోనమ్ తోసిపుచ్చింది. 'ఇందులో ఎంతమాత్రం నిజం లేదు' అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అసలు నిజం ఏమిటనేది నిలకడమీదనే తేలాలి.
News Posted: 26 May, 2009
|