'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రానికి ఆస్కార్ అవార్డుల పంట పండటంతో పాటు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ 'జైహూ' సాంగ్ తో రెండు ఆస్కార్ లు గెలుచుకోవడంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయనకు పలు హాలీవుడ్ చిత్రాల ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శల్ స్టూడియోస్ నిర్మించనున్న తుదుపరి చిత్రం 'కపుల్స్ రిట్రీట్' కు రెహ్మాన్ తాజాగా కమిట్ అయ్యారు. దీనికితోడు రెహ్మాన్ చేపట్టిన 'జైహూ' వరల్డ్ టూర్ లో భాగంగా ఇటీవల కేరళలో నిర్వహించిన కన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా రెహ్మాన్ కీర్తికిరీటంలో మరొకటి వచ్చి చేరబోతోంది. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఆయనను త్వరలోనే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబోతోంది.
యూనివర్శిటీ వర్గాల కథనం ప్రకారం జూన్ 7వ తేదీన రెహ్మాన్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.