ఐటి ఫేవరెట్ షారూక్
'నా కంటే షారూక్ సంపాదనే ఎక్కువ' అంటూ బిగ్ బి అమితాబ్ ఈమధ్యన ఓ వ్యాఖ్య చేశారు. షారూక్ స్టాటస్ అలాంటిది మరి. స్టార్ హోదా విషయంలోనే కాదు...చాలా విషయాల్లో ఆయన తన ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆదాయం పన్ను అధికారుల ఫేవరెట్ స్టార్ కూడా. అక్షరాలా 27 కోట్ల రూపాయల అడ్వాన్స్ టాక్స్ చెల్లించడం ద్వారా షారూక్ తాజాగా ఐటి శాఖ అధికారుల అభిమానం చూరగొన్నారు. దీంతో వరుసగా రెండేళ్లుగా బాలీవుడ్ నుంచి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా షారూక్ తన రికార్డును పదిలం చేసుకున్నారు.
షారూక్ 2007-2008లో తన ఆదాయం 100 కోట్లకు పైగా ఉన్నట్టు చూపించారనీ, ఆ ఏడాది 'చెక్ దే ఇండియా', 'ఓం శాంతి ఓం' వంటి రెండు బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకోవడం కూడా బాగా కలిసివచ్చిందనీ ఐటి వర్గాలు తెలిపాయి. అలాగే 'కౌన్ బనేగా కరోడ్ పతి' యాంకరింగ్ ద్వారా ఎపిసోడ్ కు కోటి రూపాయలు షారూక్ అందుకున్నారట. షారూక్ తో పాటు ఈ ఏడాది ఎక్కువ అడ్వాన్ టాక్స్ చెల్లించిన వారిలో అక్షయ్ కుమార్, హిమేష్ రేషమ్మియా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా ఉన్నారు. అయితే ఏ ఒక్కరూ షారూక్ చెల్లించిన మొత్తానికి దరిదాపుల్లో కూడా లేరు. దటీజ్ బాద్ షా...
News Posted: 27 May, 2009
|