దీపికతో రణ్ బీర్ సరాగాలు
ప్రేమికులు ఊహించని విధంగా కలుసుకోవడం, సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ ముద్దుముచ్చట్లు తీర్చుకోవడం సహజం. డేషింగ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ తాజాగా దీపికా పడుకునే నటిస్తున్న ఓ చిత్రం సెట్స్ కు నేరుగా విచ్చేసి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ తమ ప్రేమఊసులతో బిజీ అయిపోయారు. రణ్ బీర్ తాజాగా ముంబై పరసర ప్రాంతాల్లో జరుగుతున్న యష్ రాజ్ ఫిలిమ్స్ 'రాకెట్ సింగ్' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ముంబై శివార్లులోని కర్జత్ వద్ద ఫరా అక్తర్ తో కలిసి 'కార్తిక్ కాలింగ్ కార్తిక్' షూటింగ్ లో దీపిక బిజీగా ఉంది.
దీపిక ఎడబాటు తట్టుకోలేని రణ్ బీర్ నేరుగా 'కార్తీక్ కాలింగ్ కార్తీక్' సెట్ కు వెళ్లి ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చారనీ, ఆ తర్వాత ముంబై తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ప్రేమఊసులతో మునిగిపోయారనీ సినీ వర్గాల కథనం. దీపిక-రణ్ బీర్ జంటపై ఇటీవల పలు వదంతులు కూడా చర్చనీయాంశమయ్యాయి. వారి ప్రేమవ్యవహారం బీటలు వారిందనీ, కత్రినాకైఫ్ కు రణ్ బీర్ దగ్గరవుతుండటమే ఇందుకు కారణమంటూ వదంతులు వచ్చాయి. 'అజబ్ ప్రేమ కి గజబ్', 'రాజ్ నీతి' చిత్రాల్లో కత్రినా, రణ్ బీర్ జోడి కట్టడం కూడా ఈ వదంతులకు బలం చేకూర్చింది. అయితే ఈ వదంతులకు రణ్ బీర్- దీపిక ఏమాత్రం చలించినట్టు లేదు. అనూహ్యంగా ఇప్పుడు ఆ ప్రేమికులిద్దరూ సెట్స్ లో కలుసుకోవడం, హ్యాపీ మూడ్ లో కనబడటంతో తాత్కాలికంగానైనా వీరిపై వచ్చిన వదంతులకు తెరపడినట్టే.
News Posted: 27 May, 2009
|