సల్మాన్ కు కబురంపని కరణ్
స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ 37వ బర్త్ డే వేడుక సోమవారం రాత్రి ఫోర్ సీజన్స్ హోటల్ లో పరిశ్రమ అతిరథ మహారథులతో సందడిగా జరిగింది. కరణ్ గుడ్ ఫ్రెండ్స్ గా పేరున్న షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరి, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి హేమాహేమీలతో పాటు యువ హీరోలు కూడా తమ గాళ్ ప్రెండ్స్ తో సందడిగా కనిపించారు. ఇంత సందడిలోనూ సల్మాన్ ఖాన్ జాడ లేకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. షారూక్, సల్మాన్ ల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్కకుండా ఉండేందుకే సల్మాన్ ను కరణ్ ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉంచి ఉండొచ్చనే ఊహాగానాలకూ ఇది తావిచ్చింది. అయితే సల్మాన్ సోదరులైన సోహైల్ అర్బాజ్ లు తమ భార్యలతో సహా బర్త్ డే వేడుకకు విచ్చేశారు. మలికై తన సోదరి అమృత, ఆమె భర్త షకీల్ తో కలిసి పాల్గొంది.
సల్మాన్ గాళ్ ఫ్రెండ్ కత్రినాకు కరణ్ ఆహ్వానం పంపినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఆమె దక్షిణాఫ్రికాలో షూటింగ్ కారణంగా మంగళ వారం రాత్రి ముంబై చేరుకోవడంతో పార్టీకి హాజరుకాలేదు. ఒకవేళ ముంబైలో ఉండి ఉంటే ఆమె పార్టీకి హాజరై ఉండేదా? తన బాయ్ ఫ్రెండ్ సల్మాన్ కు విధేయత చాటుకునేందుకు పార్టీకి గైర్హాజరై ఉండేదా అనేది ఆసక్తి రేకెత్తించే అంశం. కత్రినా మాటెలా ఉన్నా సల్మాన్ కు ఆహ్వానం అందిందా అనే విషయంపై కరణ్ ను సంప్రదించినప్పుడు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. సైఫ్ అలీఖాన్ కరీనాతోనూ, హృతిక్ తన భార్య సుసానేతోనూ, దీపిక పడుకునే తన బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ తోనూ హాజరుకాగా, రవీనా టాండన్, రాణి ముఖర్జీ, ట్వింకిల్ ఖన్నా, ఫరా అక్తర్ వంటి 100 మందికి పైగా ముఖ్య అతిథితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు పరమేశ్వర్ గోద్రేజ్, టినా అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలు సైతం కరణ్ బర్త్ డే వేడుకలో సందడి చేశారు.
News Posted: 27 May, 2009
|