500 ఎంపీలకు వర్మ సీడీలు
'రణ్' చిత్రం విషయంలో 'జన గణ మన రణ్ హై' పాట విషయంలో చెలరేగిన వివాదం సుప్రీంకోర్టు ముందుకు తీసుకువెళ్లిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ వెనక్కి తగ్గేటట్టు కనిపించడం లేదు. దేశంలోని ఎంపీలందరికీ రీమిక్స్ చేసిన 'జన గణ మన' సీడీలను పంపబోతున్నారు. జాతీయ గీతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడంపై వర్మపై సుప్రీంకోర్డు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు రెండు రోజుల క్రితం మండిపడ్డారు. 'రణ్'లోని సాంగ్ ను తొలగించాలను సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సినిమాటోగ్రఫీ చట్టం కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ కు వెళ్లాలని కూడా వర్మకు సూచించారు. ఈ క్రమంలోనే సినిమాలోని పాటను సీడీల్లోకి ఎక్కించి 500 మంది ఎంపీలకు పంపడానికి వర్మ, ఆయన సహనిర్మాతలైన మధు మంతెన, శీతల్ తల్వార్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాలోని పాటలో తాము ఏమి చూపించబోతున్నామనే విషయాన్ని దేశాన్ని పాలించే వారికి సీడీల ద్వారా పంపించి న్యాయాన్ని వారి ముంగిట ఉంచబోతున్నామనీ, ఎవ్వరికీ ఈ విషయంలో తప్పుడు సంకేతాలు అందరాదన్నదే తమ చర్య వెనుక ముఖ్య ఉద్దేశమనీ మధు మంతెన వివరణ ఇచ్చారు. ఈవారంలోనే 500 సిడీలు ఎంపీలకు పంపనున్నామనీ, జ్యుడీషియరీని ప్రభావితం చేయాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదనీ స్పష్టం చేశారు. మొత్తానికి పరిశ్రమలో పదిహేనేళ్ల అనుభవాన్ని రంగరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెబుతున్న వర్మ తాజా వివాదం ద్వారా సినిమాకి కావాల్సినంత పబ్లసిటీని మాత్రం రాబట్టుకోగలిగారు.
News Posted: 27 May, 2009
|