డానీ బొయ్లే డైరెక్షన్లో అమీర్
హాలీవుడ్ గాలక్సీలో 'తారే' మెరియనుందా? అమీర్ ఖాన్, డానీ బోయ్లె మూడు గంటల సుదీర్ఘ ముచ్చట్ల వెనుక ఇలాంటి యోచనే ఉందని బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' దర్శకుడు డానీ బొయ్లే రెండ్రోజుల క్రితం ముంబై వచ్చారు. తన 'స్లమ్ డాగ్...' చిత్రంలో నటించిన చిన్నారులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ఓ పార్టీకి ఆతిథ్యం ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితుడుగా అమీర్ సైతం ఇందులో పాల్గొన్నారు.
డానీ బొయ్లే రాక వెనుక అమీర్ ఖాన్ ను కలుసుకుని తన తదుపరి ప్రాజెక్ట్ గురించి చర్చించే ప్రధాన ఉద్దేశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అమీర్ తో ఓ సినిమా తీయాలనే ఆలోచన ఉందంటూ కొద్ది నెలల క్రితం బొయ్లే స్పష్టం చేయడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. డిస్లెక్సిక్ చైల్డ్ కథాంశంతో అమీర్ తీసిన 'తారే జమీన్ పర్' చిత్రం అంటే తనకెంతో ఇష్టమనీ బొయ్లే అప్పట్లో చెప్పుకొచ్చారు. ముంబై చీకటి సామ్రాజ్యంపై ఓ థ్రిల్లర్ నిర్మించాలనే ఆలోచన కూడా ఆయనకు ఉంది. ముంబైలో తన తాజా పర్యటన సందర్భంగా బొయ్లే ఓ స్క్రిప్టును కూడా అమీర్ పరిశీలన కోసం ఇచ్చారనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందనీ అంటున్నారు.
News Posted: 28 May, 2009
|