మణి 'రావణ్' రీ-షూటింగ్!
దిగ్దర్శకుడు మణిరత్నం అనారోగ్యం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయన 'రావణ్' చిత్రం ఇప్పుడు మరో కొత్త కష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ జరిగిన కొంత భాగాన్ని రీషూట్ చేయాల్సిన పరిస్థితిలో ఆయన పడ్డారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్, పృధ్వీరాజ్, ప్రియమణి వంటి ప్రధాన తారాగణంతో హిందీ, తమిళ వెర్షన్లలో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేస్తున్న ఛాయాగ్రాహకుడు మణికండన్ ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో మణికి కొత్త కష్టాలు మొదలైనట్టు చెబుతున్నారు.
'రావణ్' చిత్రానికి మణికండన్ ఇచ్చిన కాల్షీట్లు పూర్తి కావడంతో ముందుగా ఆయన ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల వైపు మళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. మణికండన్ నుంచి అదనపు కాల్షీట్లు రాబట్టాలంటే అదనపు సొమ్మును మణిరత్నం ఆఫర్ చేయాల్సి ఉంది. అందుకు మణి సుముఖంగా లేరట. దీంతో మణికండన్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడ్డారు. ఇంతవరకూ 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడంతో ఇప్పుడు మణికండన్ ప్లేస్ లో సంతోష్ శివన్ వచ్చి చేరినట్టు చెబుతున్నారు. అయితే ఎవరి వర్కింగ్ స్టయిల్ వారిదే కాబట్టి కంటిన్యుటీ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసే పనిలో మణి, సదరు ఛాయాగ్రాహకుడు ఉన్నారని చెబుతున్నారు. దీంతో 'రావణ్ ' పూర్తికావడానికి మరికొంత జాప్యం అనివార్యంగానే కనిపిస్తోంది.
News Posted: 28 May, 2009
|