బాలీవుడ్ సమ్మె ముగిసింది
బాలీవుడ్ నిర్మాతలకూ, మల్టీప్లెక్స్ ఓనర్లకూ మధ్య రెవెన్యూ షేర్ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభనకు తెరపడింది. లాభాల్లో 50-50 షేర్ విషయంలో ఫిబ్రవరిలో తలెత్తిన వివాదం సమ్మెకు దారితీసింది. దీంతో ఏప్రిల్ 4 నుంచి కొత్త సినిమాల రిలీజ్ ఆగిపోయింది. ఇరు వర్గాల మధ్య శుక్రవారం ఉదయం ఓ అవగాహనకు రావడంతో నాలుగు నెలలుగా కొనసాగుతున్న సమ్మె ముగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
'సమ్మె ముగిసింది. వచ్చే వారం నుంచి కొత్త సినిమాలు విడుదలవుతాయి. మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం' అని యూటీవ్ మోషన్ పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు. సమ్మెకు తెరపడినట్టు ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ తెలిపారు. ఈనెల 12 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయని ఆయన చెప్పారు. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి సినిమాకి మొదటివారంలో 50 శాతం, రెండో వారంలో 42, మూడో వారంలో 35, నాల్గోవారంలో 35 శాతం షేర్ కు అంగీకరించారనీ, అలాగే 17.5 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ విషయంలో ఆ షేర్ 52, 45, 38, 30 (మొదటి వారం నుంచి నాల్గో వారం వరకూ) ఉంటుందనీ చెప్పారు. ఇది లీడింగ్ లో ఉన్న ఆరు మల్టీప్లెక్స్ చైన్స్ కు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇండియాలోని టాప్ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో పివిఆర్, బిగ్, ఐనాక్స్, ఫేమ్, సినిమాక్స్, ఫన్ వంటివి ఉన్నాయి. యష్ రాజ్ స్టూడియోస్ లో ఇరువర్గాల మధ్య సంప్రదింపులు జరిగాయనీ, ఈ డీల్ పై బిగ్ సినిమాస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ అమిత్ ఖన్నా సంతకాలు చేశారనీ సినీ వర్గాలు వెల్లడించాయి. మొదట్లో మిగతా మల్టీప్లెక్స్ చైన్స్ బెట్టుచేసినప్పటికీ ఆ తర్వాత దిగివచ్చాయని తెలిపారు. తాజా ఒప్పందం నేపథ్యంలో మళ్లీ కొత్త సినిమాల రిలీజ్ కు మార్గం సుగమైంది. బిగ్ బిక్చర్స్-వసుభగ్నాని సంయుక్త భాగస్వామంలో రూపొందిన 'కల్ కస్నే దేఖా', మిథున్ చక్రవర్తి నటించిన 'జోర్ లగా కే హైయ' చిత్రాలు వచ్చే శుక్రవారం విడుదల కానున్నాయి.
News Posted: 6 June, 2009
|