రెహ్మాన్ కు ఎఎంయు డాక్టరేట్
భారతీయ సంగీత కీర్తిపతాకను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కు చారిత్రాత్మక అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయూ) ఆదివారంనాడు తమ 59వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. దీంతో ఇదే విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందిన మాజీ రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్, డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం, స్వాతంత్ర్య సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి ప్రముఖలు సరసన రెహ్మాన్ కూడా చేశారు. రెహ్మాన్ తో పాటు ప్రముఖ ఉర్దూ రచయిత గోపీచంద్ నారంగ్ కూడా డాక్టరేట్ అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశారు.
దృఢమైన, సామరస్య భారత నిర్మాణంలో తనతో కలిసి రావలసిందిగా రెహ్మాన్ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. భారతీయ సత్సంప్రదాయాలు, ఫిలాసఫీకి దక్కిన గౌరవమిదని అభివర్ణించారు. భారతీయ విలువల కారణంగానే జాతీయంగా, 2009 ఆస్కార్, బాష్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో అంతర్జాతీయ విజయం సాధించానని అన్నారు. మన దేశంలోని అత్యధికులు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని కోరుకుంటున్నారనీ, అయితే సృజనాత్మక రంగాలైన మీడియా, కళల్లోకి మరింత మంది రావాల్సిన అవసరం ఉందనీ ఆయన అన్నారు. 'జయహో' నినాదంతో తన ప్రసంగాన్ని ముగించిన రెహ్మాన్ 'పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విద్యే కీలకమన్న తన విశ్వాసాన్ని విశ్వవిద్యాలయ సందర్శనం మరింత దృఢపరించింది' అని అన్నారు.
News Posted: 8 June, 2009
|