'రావణ్'కు మళ్లీ అంతరాయం
మణిరత్నం 'రావణ' (తమిళంలో 'అశోకవనం') చిత్రానికి మొదట్నించీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, విక్రమ్, ప్రియమణి వంటి స్టార్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఏభై శాతం వరకూ షూటింగ్ పూర్తయిన తర్వాత మణిరత్నం ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మణికండన్ సైతం ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. మణికండన్ ఇచ్చిన కాల్షీట్లు పూర్తికావడం, జూన్ నుంచి ఆయన షారూక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ కు కమిట్ కావడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మణిరత్నం ఇప్పుడు పూర్తి స్వస్థత చేకూరడంతో కేరళ లోని దట్టమైన అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు. అయితే ఈసారి మరో విఘ్నం ఎదురుకావడంతో షూటింగ్ కు అంతరాయం కలిగింది.
కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తుండగా ఊటీ జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారులు వచ్చి ఐశ్వర్య, విక్రమ్ లు విరామ సమయాల్లో ఉండే కారవాన్ లను సీజ్ చేశారు. ఇందులో షూటింగ్ సరంజమా మినహా మరొకటి లేకపోయినప్పటికీ కారవాన్ యజమానులు సరైన డాక్యుమెంట్లు చూపించలేకపోయారు. పన్ను ఎగవేసేందుకు రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా తారుమారు చేసినట్టు ట్రాన్స్ పోర్ట్ అధికారులు అనుమానించారు. దీంతో వాహనాలను జప్తు చేశారు. కారవాన్ సౌఖర్యం లేకపోవడమంటే నటీనటులకు అవుడ్ డోర్ లో తగిన వసతులు లేకపోవడమే అవుతుంది. దీంతో తదుపరి ఏర్పాట్లు చేసేంతవరకూ మణిరత్నం షూటింగ్ ను మధ్యలోనే ఆపేశారు.
News Posted: 11 June, 2009
|