వర్ధమాన నటిపై అఘాయిత్యం
మలేసియాలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర దర్శకుడు వినోద్ ఛాబ్రియా తనను నానా దుర్భాషలాడుతూ శారీరకంగా కూడా హింసించాడని వర్ధమాన నటి మాయ సూర్యవంశీ ముంబైలోని ఓసివర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మాయ గతంలో ఐసిఐసిఐ ప్రుడన్షియల్, రిలయెన్స్, మాక్స్ న్యూయార్క్ లైఫ్ వంటి పలు ప్రమఖ కంపెనీలకు కమర్షియల్ యాడ్స్ లో పనిచేసింది. ఇటవల ప్రొడక్షన్ హౌస్ ఛానెల్-8 కోసం తొలి సినిమాకి అగ్రిమెంట్ చేసింది. గత నెలలో ఈ చిత్రం షూటింగ్ మలేసియాలో జరిగింది. సి-గ్రేడ్ డైరెక్టర్ గా ముద్రపడిన వినోద్ ఛాబ్రియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన కరిష్మా కపూర్ నటించిన 'పపి గుడియా' వంటి పలు ఫ్లాప్ చిత్రాలు అందించారు.
మే 29న యూనిట్ సభ్యులందరి ముందూ తనను దర్శకుడు వేధింపులకు గురిచేశాడనీ మాయ తన ఫిర్యాదులో పేర్కొంది. చిత్తుగా తాగిన ఛాబ్రియా ఆ మైకంలో దుర్భాషలాడుతూ, తనను శారీరకంగానూ వేధించే ప్రయత్నం చేశాడనీ, తన చెంప కూడా పగులగొట్టాడనీ ఆమె వాపోయింది. తన అనుమతి లేకుండా ఇండియా వెళ్లలేవని బెదరిస్తూ తన పాస్ పోర్ట్ కూడా తీసుకు వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది. ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ కారణంగా తాను షూటింగ్ పూర్తి చేయడానికే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. మలేసియా నుంచి ముంబై తిరిగి వచ్చిన వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'రూమ్ లో నేను ఒంటరిగా ఉన్నానా, ఎవరితోనైనా ఉన్నానా అనే అనుమానంతో తరచు రాత్రి వేళల్లో ఛాబ్రియా తన అసెస్టెంట్ ను నా రూమ్ కు పంపేవాడు. అతడో ఉన్మాది. నేను అతని సొంత ఆస్తి అనే అభిప్రాయంతో ఉన్నాడు' అంటూ మాయ వాపోయింది. ఈ విషయమై ఛాబ్రియాను సంప్రదించినప్పుడు తన చర్యను ఆయన సమర్ధించుకున్నారు. ఆమె వ్యభిచారానికి పాల్పడుతోందనీ , అది తనకు ఇష్టం లేనందునే ప్రతిఘటించాననీ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలను మాయ తిరిగి ఖండించింది. 'నాతోనూ ఇలాగే అవాకులు చెవాకులు పేలాడు. నేను ఎలాంటి దాన్నో నా తల్లిదండ్రులకు, స్నేహితులకు బాగా తెలుసు. ఛాబ్రియా ఎలాంటివాడో ప్రపంచానికంతటికీ తెలుసు' అని చెప్పుకొచ్చింది. ఛాబ్రియాపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
News Posted: 11 June, 2009
|