రాణి పాతింటి సెంటిమెంట్
రాణి ముఖర్జీ ప్రస్తుతం ఉంటున్న జూహూ బంగ్లా ఖాళీ చేసి యారి రోడ్ లో ఇంతకు ముందు నివసించిన పాత ఇంటికి మకాం మార్చనుంది. తాను నటించిన 'దిల్ బోలే హడిప్పా' విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ లోపే మకాం మార్చాలనే స్థిర నిశ్చయంతో ఉంది. ఆమె నటించిన పలు చిత్రాలు ఇటీవ వరుస ఫ్లాపులను చవిచూశాయి. దీంతో రాణి తన పాత ఇంటికే మకాం మార్చాలనుకుంటోందంటూ పలు వార్తలు కూడా ఇటీవల కాలంలో వెలువడుతూ వచ్చాయి.
గత ఏడాది ప్రారంభంలో జూహూ హౌస్ కు రాణి మకాం మార్చిందనీ, అప్పట్నించీ వరుస ఫ్లాపుల్లో ఆమె చిక్కుకుందనీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాత ఇంట్లో ఆమె ఉన్నప్పుడు 'బ్లాక్' వంటి పలు హిట్లు ఆమెను వరించాయని వారు తెలిపారు. రాణికి పాత ఇల్లు బాగా కలిసి వచ్చినందున మళ్లీ అక్కడికే మకాం మార్చడం మంచిదంటూ రాణి ఫ్యామిలీ జ్యోతిష్యుడు సైతం కొద్దికాలంగా ఆమెకు సలహా ఇస్తున్నారు. రాణి జూహూ బంగ్లాకు వెళ్లిన తర్వాత తన కల్యాణ్ కాంప్లెక్ ఇంటిని ఒక ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చిందనీ, అయితే వారిని ఖాళీ చేయాల్సిందిగా రెండు వారాల క్రితమే ఆమె కోరిందనీ, అద్దెకున్న వాళ్లు సైతం ఇంటిని ఖాళీ చేశారనీ ఆ బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్న ఒకరు ధ్రువీకరించారు. దీనిపై వ్యాఖ్యానిచేందుకు రాణి అందుబాటులో లేదు.
News Posted: 17 June, 2009
|