మల్లిక కోసం బాక్సర్ పాట
'నాచ్ బలియే' రియాల్టీ షో కోసం సెక్సీ సుందరి బిపాసాబసుతో కలిసి గత ఏడాది డాన్స్ చేసిన ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ ఇప్పుడు మరో బాలీవుడ్ సంచలనం మల్లికా షెరావత్ కోసం గాయకుడిగా అవతారమెత్తారు.
చైనాలో జరిగిన ఆషియన్ ఛాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం (75 కిలోల మిడిల్ వెయిట్ విభాగంలో) గెలుచుకున్న విజేందర్ సింగ్ మంగళవారంనాడు స్వదేశం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా సోనీ టీవీ ప్రసారం చేస్తున్న 'దస్ కా ధమ్' రియాల్టీ షోలో మల్లికా షెరావత్ ను కలుసుకున్న విషయాన్ని, ఆమె కోసం ఓ పాట పాడిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. 'మల్లిక నా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. దీనికి తోడు సల్మాన్ కూడా కోరడంతో మల్లిక కోసం ఓ జానపద గీతాన్ని పాడాను. నా పాట విని మల్లిక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమెను కలుసుకోవడం చాలా సంతోషం కలిగించింది' అని విజేందర్ తెలిపారు. గత నెలలో మల్లిక, తనపై ఈ షో చిత్రీకరణ జరిగిందనీ, ఇండియన్ బాక్సింగ్ పట్ల సల్మాన్ కు ఉన్న పరిజ్ఞానం తననెంతో విస్మయ పరిచిందనీ చెప్పారు. బాక్సింగ్ గురించి, బాక్సర్ల గురుంచి సల్మాన్ కు ఎన్నో విషయాలు తెలుసుననీ, తామిద్దరూ కలిసి ఎన్ని జోక్ లు వేసుకున్నామో షో ప్రసారం జరిగినప్పుడు ఆంతా చూడవచ్చనీ నవ్వుతూ చెప్పారు. సల్మాన్ గురించి మీడియా చేస్తున్న ప్రచారానికి ఏమాత్రం పోలికలేని మంచి వ్యక్తి ఆయనని కితాబిచ్చారు. కాగా, విజేందర్ సెప్టెంబర్ లో ఇటలీలోని మిలన్ లో జరుగనున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనబోతున్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ కోసం ఆయన రెండ్రోజుల్లో పాటియాలా వెళ్తున్నారు.
News Posted: 17 June, 2009
|