చెన్నైపై 30 లఘు చిత్రాలు
చెన్నై నగర జీవితంపై 30 డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగబోతోంది. ఐఐటి-ఎంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ సారథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన చెన్నై ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ ను సమర్థవంతంగా నిర్వహించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ వీటిలో కొన్ని డాక్యుమెంటరీలకు నిర్మాత, దర్శకుడు, నటుడుగా వ్యవహరించబోతున్నారు.
చెన్నై నగర జీవితంపై డాక్యుమెంటరీలకు సంబంధించిన కొత్త వెంచర్ ను కమల్ హాసన్ ప్రకటిస్తూ, తన జీవితమంతా చెన్నైతోనే ముడిపడి ఉందనీ, కోడంబాక్కం, ఏవియం స్టూడియోస్ లో తాను గడిపిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేననీ అన్నారు. ఒకప్పటి చెన్నై నగరాన్ని పాత సినిమాల్లో చూస్తున్నప్పుడు తనకు వినూత్నమైన అనుభూతి కలుగుతుందని చెప్పుకొచ్చారు. 'మౌంట్ రోడ్ లో గుర్రపు బగ్గీలు తిరగడం, జనం ఎంతో తీరుబడిగా స్పెన్సర్స్ , హిగ్గిన్ బోథమ్స్ మధ్య నడుచుకుంటూ వెళ్లడం మనం ఊహించగలమా? డబ్బు సంపాదింపాచాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా చెన్నై నగరానికి ఉన్న చారిత్మక స్మృతిని పదిలం చేయాలన్నదే మా సంకల్పం' అని కమల్ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీలలో ఒకదానికి తాను దర్శకత్వం వహించనున్నట్టు చెప్పారు. చెన్నై స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ లో 250 మందికి పైగా పాల్గొన్నారనీ, వారు తయారు చేసిన స్క్రిప్టులలో 30 ఎంట్రీలను ఎంపిక చేసి వాటిని షార్ట్ ఫిల్మ్స్ గా రూపొందిస్తామని తెలిపారు. కమల్ హాసన్ తో పాటు, ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ అండ్ అకాడమికి చెందిన వి.హరిహరన్ తదితరులు ఈ స్క్రిప్టులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తికరంగా ఈ డాక్యుమెంటరీలలో ఐదింటిని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ ఫ్రెంచ్ రచయిత-దర్శకుడు జీనీ క్లాడే కేరియర్ దర్శకత్వం వహించే అవకాశముంది. కమల్ హాసన్ 'మరుదనాయగం' చిత్రానికి క్లాడే స్క్రిప్టు రచన చేశారు. అయితే ఈ చిత్రం ఇంకా వెలుగుచూడలేదు.
News Posted: 20 June, 2009
|