ప్రీతి-నెస్ చీలిక వెనుక?
చొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా, ప్రముఖ పారిశ్రామిక వేత్త నెస్ వాడియా విడిపోతారనే ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం 2009 ఐ.పి.ఎల్. సీజన్ ప్రారంభానికి ముందు వరకూ బాగానే ఉంది. అన్నీ సజావుగా జరిగితే ఈ ఏడాది చివరిలోగా ఇద్దరూ పెళ్లిపీటల మీద కూర్చోవాలనే ప్లాన్ కూడా చేశారు. ఇంతలోనే ఏం జరిగింది? నెస్ తో విడిపోయినట్టు ప్రీతి ఎందుకు తెగేసి చెప్పాల్సి వచ్చింది? నెస్ పేల్చిన ఓ బాంబు ప్రీతిని కలవర పరచడమే ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం నిట్టనిలువుగా చీలిపోవడానికి కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
'వివాహం తర్వాత ప్రీతి సినిమాల్లో నటించడం నెస్ కు సుతరామూ ఇష్టం లేదు. ఈ విషయాన్ని ప్రీతికి ఆయన చెప్పినప్పుడు ఆమె దిగ్భ్రాంతికి గురైంది. మొదట్లో నెస్ ఏదో సరదాగా అనుంటాడని ఆమె తలపోసింది. అయితే నెస్ సీరియస్ గానే ఈ విషయం చెప్పినట్టు ఆ తర్వాత గ్రహించింది. ఆమె గుండె బద్ధలైంది' అని ఆ వర్గాలు వెల్లడించాయి. సినిమాలకు దూరం కావడం, షరతులతో కూడిన బంధానికి ప్రీతి విముఖంగా ఉందనీ, నెస్ తో విడిపోవాలనే ఆలోచన బాధాకరమే అయినప్పటికీ ఇద్దరూ పట్టువిడుపులు లేని ధోరణిలోనే ఉన్నారనీ వారు తెలిపారు. నెస్ కోరికను ఎందుకు ప్రీతి అంగీకరించలేకపోయిందనే విషయానికి వారు మరింత వివరణ ఇస్తూ 'సినిమాల్లో నటించడం వల్ల తనకు లభించే ఆర్థిక ప్రయోజనాలు, సెక్యూరిటీని త్యాగం చేయాలని ప్రీతి అనుకోవడం లేదు. ఆమె సొంతంగానే పాపులారిటీ సంపాందించుకుంది. ఎన్నో సక్సెస్ లు చవిచూసింది. వాటన్నింటిని ఒక్కరోజులో వదులుకోవాలని అనుకోవడం లేదు' అని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన సినిమాల వరకైనా నటించాలనుకుంటున్నట్టు నెస్ కు ప్రీతి చెప్పిందనీ, అయితే సినిమాలకు స్వస్తి చెప్పడమే మంచిదన్న నిశ్చితాభిప్రాయాన్ని నెస్ వ్యక్తం చేశారనీ వారు అంటున్నారు. ప్రీతి చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయనీ, తాజాగా యష్ చోప్రా చిత్రంలో అమీర్ ఖాన్ సరసన నటించేందుకు కూడా నిర్ణయించుకుందనీ వారు తెలిపారు. ఇప్పుడు అమీర్ ఆ సినిమాకు దూరం కావడం మరో కథ...
News Posted: 20 June, 2009
|