షారూక్ పై ఫత్వా
కింగ్ ఖాన్ షారూక్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై బరేలీలోని మత సంస్థలు కన్నెర్ర చేశాయి. నాలుగైదు రోజులుగా షారూక్ పోస్టర్లు, గడ్డిబొమ్మలు దగ్ధం చేయడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇస్లామిక్ సంస్థ ఆయనపై ఫత్వా జారీ చేసింది. దారుల్- ఉలూమ్-మజహర్- ఇ- ఇస్లామ్ సంస్థకు చెందిన ముఫ్తి మహమ్మద్ సోయెబ్ రజా ఖాద్రి, ముఫ్తి ముటి-ఉర్-రెహ్మాన్ పేరిట ఈ ఫత్యాలు జారీ అయ్యాయి.
షారూక్ ఒక కాఫిర్ అనీ, అలాంటి వ్యక్తిని ఇస్లాం నుంచి బయటకు గెంటేయాలని ముఫ్తి మహహ్మద్ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడిన వారు మరణ శిక్షకు అర్హులనీ, గౌరితో అతని వివాహం చెల్లనేరదనీ, ముస్లిం స్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి కూడా అర్హత కోల్పోతారని ఆ ఫత్యాలో పేర్కొన్నారు. మరోవైపు ఫత్వా జారీ పట్ల ముస్లిం పెద్దలు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మత సంస్థలు జారీ చేసిన డిక్రీలు అనుచితమని బర్వేలి సెక్ట్ నుంచి ఫత్వాలు జారీ చేసే అధికారమున్న మర్కజి దారుల్ అఫ్తాకు చెందిన ప్రతినిధి మౌలానా షాబుద్దీన్ స్పష్టం చేశారు. వ్యాఖ్యలు చేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్వయంగా ప్రవక్తపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని వివరణ కూడా ఇచ్చారనీ, అలాంటప్పుడు అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. షారూక్ పై జారీ చేసిన ఫత్వాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదనీ, అలాంటి ఫత్యాలు జారీచేయాలనే ఆలోచన తమకు కూడా లేదనీ ఆయన అన్నారు. మీడియా వార్తల ఆధారంగా ఫత్యాలు జారీచేయరాదని మరో మతపెద్ద మౌలానా యాసిన్ మిస్ బహి వ్యాఖ్యానించారు. 'టైమ్ ఎన్ స్టైల్' మ్యాగజైన్ లో షారూక్ ఇంటర్వ్యూ ప్రచురితమైన తర్వాత ఈ వివాదం మొదలైంది. అయితే తాను ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదనీ, తన మాటలను తప్పుగా ప్రచురించారని షారూక్ అమెరికా నుంచి రెండ్రోజుల క్రితం వివరణ ఇచ్చారు. మహమ్మద్ ప్రవక్త కంటే గొప్పవారు ఎవరూ లేరన్నదే తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. షారూక్ ప్రస్తుతం అమెరికాలో కరణ్ జోహర్ 'మై నేమ్ ఈజ్ ఖాన్ ' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
News Posted: 23 June, 2009
|