స్లమ్ డాగ్ 'గూన్' అరెస్టు
పలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలో 'జావెద్ గూన్' పాత్రలో నటించిన అజిత్ పాండేను ముంబై పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ సోదరుడిగా చెప్పుకొంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం, కాస్టింగ్ డెరెక్టర్ ఒకరిని చంపుతానని బెదరించడం వంటి అభియోగాలపై పాండేను అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) రాకేష్ మరియా తెలియజేసిన వివరాల ప్రకారం...రామానంద్ సాగర్ ప్రొడక్షన్ హెడ్ కు మే 24న పాండే ఫోన్ చేశాడు. తాను ఛోటా షకీలా సోదరుడైన హుస్రినంటూ పరిచయం చేసుకున్నాడు. తనకు మిత్రుడైన అజిత్ పాండేకి సీరియల్స్ లో నటించే అవకాశం ఇవ్వాల్సిందిగా బెదరించాడు. ఆ బెదరింపులను ప్రొడక్షన్ హెడ్ ఖాతరు చేయలేదు. దీంతో 20 లక్షల సొమ్ము ఇవ్వాల్సిందిగా బెదరించాడు. దీనిపై పోలీసులు విచారణ జరిపి పాండే ఉపయోగించిన సిమ్ కార్డ్ ను కనుగొన్నారు. మధ్యప్రదేశ్ లోని సత్నాలో ఆ కార్డు కొనుగోలు చేసినట్టు తెలుసుకున్న తెలుసుకుని పాండే ఈ నేరానికి పాల్పడినట్టు కనుగొన్నారు. సబర్బన్ బయందర్ లో పోలీసులు వల పన్ని పాండేని అదుపులోనికి తీసుకున్నారు. పాండేపై ఐపిసి సెక్షన్ 384 (బలవంతపు వసూళ్లు), 505 (2) (బెదరింపులు) కింద కేసు నమోదు చేసి స్థానిక కోర్టు ముదు హాజరు పరచాయి. ఈనెల 27 వరకూ పాండేని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. నటుడిగా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే షకీల్ పేరుతో ఇలాంటి చర్యలకు పాండే పాల్పడి ఉండవచ్చని రాకేష్ మరియా అభిప్రాయపడ్డారు. పాండే 'ఓ డార్లింగ్ యే హై ఇండియా', 'జై హనుమాన్' వంటి పలు సీరియల్స్ లో నటించారు.
News Posted: 23 June, 2009
|