'షైనీ మద్యం సేవించలేదు'
ముంబై: పనిమనిషిపై అత్యాచారం జరిగిన సమయంలో బాలీవుడ్ నటుడు షైనీ అహుజా మద్యం సేవించి లేడని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. సంఘటన సమయంలో నిందితుడు మద్యం సేవించలేదనీ, పూర్తి స్పృహతో ఉన్నాడనీ నివేదిక పేర్కొన్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీస్ నికెట్ కౌషిక్ మంగళవారంనాడు తెలిపారు. ఇంటి పనిమనిషిపై ఆత్యాచారం జరిపిన అభియోగంపై షైనీ గత వారంలో అరెస్టు కావడం బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.
మద్యం, డ్రగ్స్ ప్రభావం వల్లనే తాను ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చని షైనీ అభిప్రాయపడటంతో అతని అరెస్టు అనంతరం బ్లడ్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపారు. అయితే షైనీ మందు, పొగతాగడం చేయలేదంటూ ఆయన భార్య అనుపమ్ గతవారం స్పష్టం చేసింది. సాక్ష్యం కోసం షైనీ నివాసం నుంచి సేకరించిన మరికొన్ని ఆధారాలపై ఎఫ్ఎస్ఎల్ నివేదక, డిఎన్ ఎ టెస్ట్ వివరాలు ఇంకా అందవలసి ఉందని పోలీసులు తెలిపారు. షైనీ తనపై అత్యాచారం జరిపాడంటూ ఈనెల 14న ఓషివర పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్నిపోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జాతీయ మహిళా సంఘానికి (ఎన్. సి.డబ్లు) చెందిన ఒక బృందం ముంబై చేరుకుని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిసింది. ఎన్ సిడబ్లు పర్యటన నేపథ్యంలో షైనీ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు త్వరలోనే అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ప్రకటించారు.
News Posted: 23 June, 2009
|