16 మందినీ పెళ్లాడతా : రాఖీ
సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ ఎక్కడ ఉంటే సంచలనాలు అక్కడే ఉంటాయనేది బాలీవుడ్ లో ఓ నానుడి ఉంది. చాలాకాలంగా కలిసి తిరిగిన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుని ఈమధ్యనే రాఖీ 'స్వయంవరం' ప్రకటించింది. 'రాఖీ సావంత్ కా స్వయంవర్ ' రియాల్టీ షో ద్వారా తన జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియకు ఆమె స్వీకారం చుట్టింది. రామాయణ కాలంలో కూడా సీత స్వయంవరంలోనే రాముడిని వరించినందనీ, అలాంటిది తాను స్వయంవరం ప్రకటిస్తే తప్పేమిటని తన చర్యను రాఖీ ఇటీవల సమర్ధించుకుంది. రియాల్టీ షో ద్వారా ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటాన్న రాఖీ తాజాగా మాటమార్చి 'స్వయంవరం'లో ఎంపిక చేసిన 16 మందినీ పెళ్లి చేసుకుంటానంటోంది.
'మహాభారతంలో ద్రౌపదిలాగా నాకు ఉండాలనుంది. పోటీలో ఎంపికైన 16 మంది చాలా గొప్పవారు. నాకు బాగా నచ్చేశారు. అందర్నీ పెళ్లి చేసుకోవాలనుంది' అంటూ మీడియాకు రాఖీ నవ్వుతూ చెప్పింది. ఉదయ్ పూర్ లోని అత్యంత ఖరీదైన హోటల్స్ లో ఈ షో చిత్రీకరించారు. తాను ఇందులో పాల్గొన్నప్పుడు ఉదయ్ పూర్ రాజకుమారిలా అనుభూతి చెందాననీ, చాలా ఎంజాయ్ చేశాననీ ఆమె చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా 12.515 ఎంట్రీల నుంచి 16 మందిని రాఖీ పోటీకి ఎంపిక చేసుకుంది. ఈ 16 మందిలో ఫేవరెట్ ఎవరో చెప్పమని అడిగినప్పుడు 'అందరూ నాకు నచ్చారు' అంటూ రాఖీ సిగ్గుమొగ్గలైంది. 'రాఖీ సావంత్ కా స్వయంవర్' షో ఈనెల 29న ఎన్డీటీవీ ఇమాజిన్ లో ప్రసారమవుతుంది.
News Posted: 24 June, 2009
|