సర్దార్జీ వేషంలో రాణి
హిందీ పాపులర్ నటి రాణీ ముఖర్జీ ఏ పాత్ర పోషించినా సహజత్వానికి దగ్గరగా ఉంటుందనే పేరు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో రాణికి సరైన హిట్లు లేకపోయినా ఆ కొరతను 'దిల్ బోలె హడిప్పా' చిత్రం తీరుస్తుందనే ధీమాను ఆమె వ్యక్తం చేస్తోంది. పనిలో పనిగా తన ఫ్లాపులకు కారణమని భావిస్తున్న కొత్తింటిని విడిచిపెట్టి ముంబై బాంద్రాలోని తన పాతింటికే షిఫ్ట్ కావడంతో ఇక హిట్ ఖాయమనే సెంటిమెంట్ నూ ఆమె బలంగా నమ్ముతోంది. 'దిల్ బోలె హడిప్పా' లో రాణి వర్కింగ్ స్టిల్స్, థియేటర్ ట్రైలర్స్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ సర్దార్జీ గెటప్ లో కనిపించడం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. షాహిద్ కపూర్ జంటగా రాణిముఖర్జీ నటిస్తుండటం కూడా ఈ చిత్రంపై యూత్ లో క్రేజ్ ను పెంచుతోంది.
పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రకథ ఉంటుంది. విలేజ్ అమ్మాయి అయిన రాణి తన కలలు పండించుకునేందుకు పురుషుడి వేషంలోకి మారుతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ సింగ్ తీర్చిదిద్దారు. రాణి పంజాబీ లుక్ ను లండన్ కు చెందిన మైక్ స్ట్రింగర్ ('ధూమ్-2' ఫేమ్) డిజైన్ చేయడం విశేషం. సర్జార్జీ గెటప్ లో అచ్చు ఓ పాతికేళ్ల పంజాబీ కుర్రాడిలా రాణి కనిపిస్తుందని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా వంటి స్టార్ అట్రాక్షన్ కూడా ఉంది. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. సర్దార్జీగా రాణి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది చూడాలి...
News Posted: 27 June, 2009
|