వహిదాను నిరాశపరచిన రజనీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుసుకునేందుకు సీనియర్ నటి వహిదా రెహమాన్ రెండు రోజుల పాటు చెన్నైలో నిరీక్షించి చివరకు నిరాశతో వెనుదిరిగారు. హైదారాబాదీ ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన వహిదా రెహమాన్ తొలినాళ్లలో 'జయసింహ', 'రోజులు మారాయి' వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప్యాసా', 'కాగజ్ కా ఫూల్', 'గైడ్' వంటి ఎన్నో విలక్షణ చిత్రాలతో పాటు ఇటీవల 'వాటర్', 'రంగ్ దే బసంతి' వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఉత్తమ నటిగా జాతీయ, ఫిల్మ్ ఫేర్ తదితర అవార్డులను, 2006 ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. వహిదా ఇటీవల జపాన్ వెళ్లినప్పుడు అక్కడ వారికి తెలిసిన ఏకైక నటుడు రజనీకాంత్ ఒక్కరే కావడం ఆమెను ఆశ్చర్యపరచింది. 'మీరు రజనీకాంత్ పుట్టిన ఇండియాకు చెందిన వారా?' అని జపనీయులు అడిగారట. దీంతో ఇండియా వెళ్లిన వెంటనే చెన్నైలో రజనీకాంత్ ను కలుసుకోవాలని వహిదా నిర్ణయించుకున్నారు.
రెండ్రోజుల క్రితమే చెన్నై వెళ్లిన వహిదా రజనీకాంత్ ను కలుసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే రజనీకాంత్ అనారోగ్యం కారణంగా తన అప్పాయింట్ మెంట్స్ అన్నింటినీ కేన్సిల్ చేశారు. ఇది తెలుసుకున్న వహిదా నిరాశతోనే తిరిగి ముంబై వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత రజనాకాంత్ కు ఈ విషయం తెలియడంతో ఆయన బాధ పడ్డారట. ఒంట్లో కొంచెం నెమ్మదించిన తర్వాత వహిదాను చెన్నైకు ఆహ్వానించడం కానీ, తానే ముంబై వెళ్లి ఆమెను స్వయంగా కలుసుకోవడం కానీ చేయాలని రజనీ నిశ్చయించినట్టు సమాచారం.
News Posted: 29 June, 2009
|