షారూక్ కు బ్రిటన్ డాక్టరేట్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు కళలు, సాంస్కృతికరంగంలో చేసిన సేవలకు గాను బ్రిటన్ కు చెందిన బెల్ ఫోర్డ్ షైర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనుంది. జూలై 10న లండన్ లో జరుగునున్న కార్యక్రమంలో షారూక్ కు ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. ప్రతిష్ఠాత్మక బ్రిటీష్ నైట్ హుడ్ తో సమానమైన మలేసియా ప్రభుత్వ అవార్డు 'దతుక్'ను షారూక్ గత ఏడాది అందుకున్నారు.
వివిధ దేశాల్లోని యూనివర్శిటీలు, విద్యా ట్రస్టులతో సన్నిహితంగా పనిచేసే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎఎన్ జీవో)కు చెందిన ఎన్జీవో 'రూట్స్ 2 రూట్స్' ద్వారా షారూక్ బెల్ ఫోర్డ్ షైన్ యూనివర్శిటీ డాక్టరేట్ అవార్డుకు ఎంపికయ్యారు. బెల్ ఫోర్డ్ షైర్ యూనివర్శిటీ నుంచి కళలు, సాంస్కృతిక రంగాల్లో గౌరవ డాక్టరేట్ కు 'రూట్స్ 2 రూట్స్' తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని షారూక్ తన స్పందన తెలియజేశారు. షారూక్ ఖాన్ బాలీవుడ్ కింగ్ గా గుర్తింపు పొందడంతో పాటు, అట్టడుగు వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నారనీ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ తన ఛారిటీని చాటుకుంటున్నారనీ 'రూట్స్ 2 రూట్స్' సహ వ్యవస్థాపకుడు టినా వచాని తెలిపారు. అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిన తర్వాతే షారూక్ ను ఎంపిక చేసినట్టు చెప్పారు.
News Posted: 29 June, 2009
|