దక్షిణాది సినిమాల పట్ల త్రిష ఆసక్తి సన్నగిల్లిందా? బాలీవుడ్ 'ఖట్టా మీఠా' చిత్రం కోసం త్రిషను దర్శకుడు ప్రియదర్శన్ ఎంపిక చేసినప్పటి నుంచి తమిళ సినిమాలను ఒదులుకునేందుకు త్రిష సిద్ధపడుతోందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం త్రిష చేతిలో రెండు తమిళ చిత్రాలున్నాయి. వీటిలో ఒకటి గౌతమ్ మీనన్ చిత్రం కాగా, ప్రస్తుతం ఆ చిత్రం ఆగిపోయినట్టు చెబుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైన ధనుష్ తో 'అడుకలామ్' అనే సినిమా కూడా త్రిష చేతిలో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆ చిత్రం నుండి వైదొలగేందుకు త్రిష, ఆ చిత్ర నిర్మాతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి.
'అడుకలామ్' చిత్రం ఈమధ్య 3 రోజుల పాటు షూటింగ్ జరిగి ఆ తర్వాత ఎలాంటి ప్రోగ్రస్ లేకుండా ఆగిపోయింది. దీంతో త్రిష కాల్షీట్లను నిర్మాతలు ఉపయోగించుకోలేకపోయారు. ఫలితంగా త్రిష ఇటీవల మధురైలోని ఓ హోటల్ లో నాలుగు రోజుల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. 'అక్షయ్ కుమార్ తో హిందీ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి త్రిష తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేని పరిస్థితిలో ఉంది. బాలీవుడ్ ప్లాన్స్ కు ఈ ప్రాజెక్ట్ లు విఘాతం కలిగిస్తాయని ఆమె అభిప్రాయపడుతున్నట్టుంది' అని సీనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం త్రిష తెలుగు సినిమాల్లోనూ బిజీగా ఉంది. గోపీచంద్ సరసన నటిస్తున్న 'శంఖం' చిత్రం కోసం త్రిష ప్రస్తుతం సిడ్నీలో ఉంది. అక్కడి నుంచి ఆమె శింబుతో కలిసి నటిస్తున్న 'విన్నైతాండి వరువయ' చిత్రం షూటింగ్ కోసం న్యూయార్క్ వెళ్తుంది. ఆ తర్వాత నేరుగా యూరప్ వెళ్లి విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' షూటింగ్ లో పాల్గొంటారు. అక్టోబర్ నుంచి ఆమె ముంబైలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న హిందీ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చారు. సింగిల్ షెడ్యూల్ లో ఆ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రియదర్శన్ ప్లాన్ చేస్తున్నారు. ఏతావాతా...'అడుకలామ్' చిత్రానికి త్రిష ఇప్పట్లో డేట్లు కేటాయించే అవకాశం లేనందున ఆ చిత్రం నుంచి త్రిష తప్పుకోవడం అనివార్యంగానే కనిపిస్తోంది.