షైనీ ఉదంతంపై సినిమా
పనిమనిషిపై అత్యాచారం జరిపిన అభియోగంపై అరెస్టయి ప్రస్తుతం జ్యూడియషల్ కస్టడీలో ఉన్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా ఉదంతం బాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపింది. షైనీకి తొలుత సంఘీభావం తెలిపిన సినీ ప్రముఖులు ఆ తర్వాత షైనీ తన తప్పిదాన్ని ఒప్పుకునే రీతిలో మాట్లాడటంతో డిఫెన్స్ లో పడ్డారు. వారి ప్రయత్నాల మాటెలా ఉన్నా షైనీ ఉదంతాన్ని ఇప్పుడు ఓ చిన్న నిర్మాత ఎకాఎకిన వెండితెరకెక్కించేస్తున్నారు. 'చమక్-ది షైనింగ్' అనే పేరుతో ఈ చిత్రాన్ని కె.ఎ.జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండ్రోజుల క్రితమే ముంబైలో ప్రారంభమైంది. దీనికి హాజిపురి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖుల జీవితాలపై దర్శకుడు ఖమర్ హాజ్ పిరి 6 నెలలుగా స్క్రిప్టు వర్క్ చేస్తున్నారనీ, ఇందులో షైనీ అహుజా ఉదంతం వంటిందే ఓ సన్నివేశం ఉండటం యాదృచ్ఛికమనీ జోహర్ తెలిపారు. సినీ పరిశ్రమలో సక్సెస్ ను నిలబెట్టుకోవడం ఎంత కష్టమనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. పంజాబ్ కు చెందిన ఒక యువకుడు ముంబై వచ్చి నటుడు కావడానికి ఎన్నో కష్టాలు పడతాడనీ, ఊహించని విధంగా సూపర్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత అహంభావంతో ఎలా కిందకి పడిపోతాడన్నదే ఈ చిత్ర కథాంశమనీ చెప్పారు. ఈ చిత్రంలో హితేన్ రాగోర్, దివ్య త్రివేది తదితరులు నటిస్తున్నారు. సంజీవ్-దర్శన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే సినిమా విడుదల చేయాలనే ఆలోచనతో దర్శకనిర్మాతలు ఉన్నాయి.
News Posted: 30 June, 2009
|