ఐశ్వర్యారాయ్ తర్వాత నేనే!
ఈ మాట అనాలంటే చాలా గట్స్ ఉండాలి. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగానూ ఐశ్వర్యరాయ్ ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, బ్యానర్లలో నటించి తన సత్తా చాటుకుంది. ఓ రకంగా పెళ్లికి ముందు కంటే ఇప్పుడు పలు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లతో మరింత బిజీగా ఉంది. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో 'రోబో' చిత్రంలోనూ, దిగ్దర్శకుడు మణిరత్నం 'రావణ్' చిత్రంలో తన హబ్బీ అభిషేక్ తోనూ కలిసి నటిస్తోంది. 'రావణ్' చిత్రంలో ఐశ్వర్యరాయ్ తో పాటు ఓ కీలక పాత్రలో ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న అందాల నటి ప్రియమణి కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రకు చాలా మంచి గుర్తింపు వస్తుందంటూ ప్రియమణి ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ మధ్యనే మణిరత్నం ఆరోగ్యం బాగోలేకపోవడం, సినిమాటోగ్రాఫర్ మారడం వంటి ఆటుపోట్ల మధ్య 'రావణ్' చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ గాడిలో పడింది. ప్రియమణి తన తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్రం ప్రస్తావన వచ్చినప్పుడు 'ఈ చిత్రం పేరు చెప్పగానే ఐశ్వర్యారాయ్ పేరే అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. అందరూ నా నటన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు' అంటూ సగర్వంగా చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా కీలకమనీ, ఇంతవరకూ జరిగిన షూటింగ్ లో తన నటన పట్ల మణిరత్నం ఎంతో సంతృప్తిగా ఉన్నారనీ తెలిపింది. ఐశ్వర్య హీరోయిన్ అయినా తన పాత్ర 'టాక్ ఆఫ్ ది టౌన్' అవుతుందంటున్న ప్రియమణి మాటల్లో నిజానిజాలు తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
News Posted: 30 June, 2009
|