బాలీవుడ్ తెరపై ధోని-యూవీ
ఇండియన్ క్రికెట్ రథసారథి ధోని, స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇప్పుడు వెండితెరను కూడా అలరించబోతున్నారు. ధోనీ, యువరాజ్ సింగ్ ప్రధాన పాత్రధారులుగా క్లాక్ వర్క్ ఫిలిమ్స్ బ్యానర్ పై డినో మోరియా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను దృష్టిలో పెట్టుకుని డినో సొంతంగా స్క్రిప్టు రచన కూడా చేస్తుండటం విశేషం.
యువరాజ్, ధోనీలు వ్యక్తిగతంగా కూడా బాలీవుడ్ లోని గ్లామర్ బ్రిగేట్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వారే. ధోని ఇప్పటికే డేవిడ్ ధావన్ 'హుక్ యా క్రూక్' చిత్రంలో నటిస్తున్నారు. ప్రొఫెషనల్ యాక్టర్లుగా కెమెరా ముందుకు రావాలని ధోనీ, యువరాజ్ అనుకుంటున్న తరుణంలో ఆ ఇద్దరికీ డినో నుంచి ఈ ఆఫర్ వరించింది. కెమెరాను ఫేస్ చేయడం ఇద్దరికీ కొత్త కాదనీ, ఇప్పటికే పలు యాడ్స్, టెలివిజన్ కార్యక్రమాలు చేయడం ద్వారా మునుముందు మంచి ప్రొఫెషనలిజం చూపగలరనే నమ్మకం తనకు ఉందనీ డినో వ్యాఖ్యానించారు. ఇద్దరు స్టార్ క్రికెటర్లనూ కలుపుతూ సినిమా తీసే ఆలోచపై అడిగినప్పుడు 'చాలా సహజమైన ప్రక్రియే ఇది. అయితే ఇద్దరూ బిజీ క్రికెటర్లు కావడమే ప్రధాన అవరోధమని చెప్పాలి. ఇద్దరి డేట్లు జాగ్రత్తగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం' అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఆయన చెప్పడానికి నిరాకరించారు. అయితే స్పోర్ట్ కథాంశంతోనే ఈ సినిమా ఉంటుందనీ, డినో కూడా ఇందులో నటిస్తారనీ తెలుస్తోంది. ఈ చిత్రంపై డినో మరింత ఉత్కంఠ పెంచుతూ 'నేను నిర్మాణ సంస్థ ప్రారంభించనప్పటి నుంచి యువరాజ్ నాకు బాగా తెలుసు. ఇప్పుడు ధోని కూడా ఈ ప్రాజెక్ట్ లో వచ్చి చేశారు. సచిన్ టెండూల్కర్ ను కూడా సంప్రదిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
News Posted: 1 July, 2009
|