'న్యూయార్క్' కథ కొట్టేశారా?!
బాలీవుడ్ నిర్మాతలకూ, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకూ మధ్య లాభాల షేర్ విషయంలో తలెత్తిన వివాదం నాలుగు నెలల పాటు కొనసాగి ఈ మధ్యనే 'సమ్మె'కు తెరపడటంతో కొత్త సినిమాలు ఒక్కసారిగా థియేటర్లను ముంచెత్తుతున్నాయి. మొన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ రాజ్ ఫిలిమ్స్ 'న్యూయార్క్' చిత్రం అరుదైన ప్రశంసలు, మంచి ఓపినింగ్ కలెక్షన్లు రాబట్టుకుంటూ విజయపథంలోకి దూసుకు వెళ్లోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జాన్ అబ్రహం, నీల్ నితిన్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆసక్తికరంగా ఇప్పుడు ఈ చిత్ర కథ తనదేనంటూ జనాలకు ఓ మోస్తరుగా మాత్రమే తెలిసిన దర్శకురాలు, రచయిత సుచిత్ర భాటియా సరికొత్త వివాదాన్ని లేపారు.
ఈ చిత్ర కథను తాను 2006లో సిద్ధం చేసుకుని అదే ఏడాది ఆగస్టులో ఆదిత్య చోప్రాను కలిశాననీ, ఆయన దర్శకుడు అర్జున్ సబ్ లోక్ కు కథాగమనాన్ని వివరించమని చెప్పారనీ భాటియా తెలిపింది. ఆ తర్వాత యష్ రాజ్ స్టూడియోలో అర్జున్ సబ్ లోక్ ని కలిసి రెండు కథలను ఆయనకు వినిపించాననీ, 'వావ్' అంటూ ఆయన మెచ్చుకోవడం ఇప్పటికీ తనకు బాగా గుర్తనీ ఆమె అన్నారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ముఖం చాటేశారనీ, మూడేళ్లుగా తాను కూడా ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్నాననీ, ఇంతలోనే తన కథతోనే 'న్యూయార్క్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఆమె ఆరోపించారు. కనీసం కథ తీసుకున్న విషయాన్ని తనకు చెప్పడం కానీ, స్టోరీ క్రెడిట్ గానీ ఇవ్వలేదంటూ ఆమె వాపోయారు. అయితే ఆమె ఆరోపణలను అర్జున్ సబ్ లోక్ ఖండించారు. తానెప్పుడూ ఆమెను కలుసుకోలేదని చెప్పారు. మరికొంత వ్యవధి తర్వాతే తాను పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఏతావాతా కథాచౌర్యం జరిగిన విషయంలో నిజానిజాలు తేలవలసి ఉంది.
News Posted: 4 July, 2009
|