మున్నాభాయ్ 'త్రీ' చీర్స్...
బాలీవుడ్ లో రాబోయే దీపావళి సీజన్ ఎవరిదో చెప్పుకోండి? ఖాన్ ల త్రయానిది ఎంతమాత్రం కాదు. అక్షయ్ కుమార్ ది అసలే కాదు. మున్నాభాయ్ అలియాస్ సంజయ్ దత్ దే హవా. ఆయన నటించిన మూడు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటమే ఈ స్పెషాలిటీ. అజయ్ దేవగణ్ తో కలిసి సంజయ్ నటిస్తున్న చిత్రం, అష్ట వినాయక్ సినీ విజన్ 'బ్లూ', ఎరోస్ సంస్థ 'అలాదీన్' చిత్రాలు అక్టోబర్ 16న విడుదల కానున్నాయి.
ఒకే నటుడు నటించిన రెండు చిత్రాలు ఏకకాలంలో విడుదలైన సందర్భాలు గతంలో ఉన్నప్పటికీ మూడు సినిమాలు ఒకేరోజున విడుదలవుతుండటం ఇదే ప్రథమమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంజయ్ నటించిన ఈ మూడు చిత్రాలు ఒకదానితో మరొకటి పొంతన లేని వైవిధ్య భరితమైన చిత్రాలే కావడం విశేషం. 'బ్లూ' చిత్రం 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అండర్ వాటర్ స్టంట్ లు కూడా ఇందులో చాలనే ఉండబోతున్నాయి. అజయ్ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోంది. 'అలాదీన్' ఫాంటసీ చిత్రం. ఈ మూడు చిత్రాలు ఒకేరోజు విడుదలవుతున్న విషయాన్ని ఆయా చిత్రాల నిర్మాతలు సైతం ధ్రువీకరించారు. 'అలాదీన్' చిత్రాన్ని అక్టోబర్ 16న దీపావళికి విడుదల చేస్తున్నట్టు ఎరోజ్ సంస్థ ప్రతినిధి తెలిపారు. మిగతా చిత్రాల గురించి తమకు తెలియదనీ, తాము మాత్రం ఆ తేదీకే కట్టుబడి ఉంటామని చెప్పారు. అజయ్ చిత్రాన్ని కూడా దీపావళికే రిలీజ్ చేయనున్నామనీ, అయితే కచ్చితమైన విడుదల తేదీ మాత్రం తనకు తెలియదనీ అజయ్ తదుపరి చిత్రానికి దర్శకుడైన రోహిత్ షెట్టి వివరించారు. అష్టవినాయక్ 'బ్లూ' చిత్ర నిర్మాతలను సంప్రదించినప్పుడు 'తక్కిన రెండు రిలీజ్ ల విషయం మా దృష్టికి కూడా వచ్చింది. మేము మాత్రం నిశ్చయంగా అక్టోబర్ 16వ తేదీకి కట్టుబడి ఉన్నాం. వైవిధ్యమైన కథాంశాలు కావడంతో మూడు సినిమాలకూ మంచి బాక్సాఫీస్ ఫలితం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నాం' అని వారు వివరణ ఇచ్చారు.
News Posted: 7 July, 2009
|