ఖాన్ ద్వయం షారూక్, సల్మాన్ ల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే వైరం కనిపిస్తుంటుంది. ఈ ఇద్దరి మధ్యా పత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చోటుచేసుకున్న ఓ తమాషా సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. షారూక్ సినిమా కోసం ఓ పాట చిత్రీకరణలో ఉపయోగించాల్సిన రెడ్ గిటార్ ను మార్చవలసి రావడంతో సప్లయిర్స్ నేరుగా సల్మాన్ 'డెన్'లోకి చొరపడి ఆయన్నుంచి సరిగ్గా అలాంటి గిటార్ నే తస్కరించి షారూక్ చేతిలో పెట్టారట.
షారూక్ 'దుల్హా మిల్ గయా' అనే చిత్రం షూటింగ్ లో ఇటీవల పాల్గొన్నారు. రెట్ గిటార్ ను ఆయన ప్లే చేయవలసిన సన్నివేశాలను చిత్రీకరీస్తున్నారు అయితే మ్యూజిక్ సప్లయిర్స్ అందజేసిన రెడ్ గిటార్ చూడముచ్చడగా లేకపోవడంతో దర్శకుడు ముదస్సర్ అజీజ్, కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ లు వెంటనే వేరే గిటార్ ఎరేంజ్ చేయాల్సిందిగా సప్లయిర్స్ ను కోరారు. అయితే ఆ తరహా గిటార్ ఒకే ఒక్కటి సిటీలో అందుబాటులో ఉంది. అది కూడా సల్మాన్ వద్దనే ఉంది. సల్మాన్ అదే సమయంలో ఫేమస్ స్టూడియోస్ లో జరుగుతున్న 'వాంటెడ్' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. షారూక్ డేట్లు ఎంతో కష్టం మీద సంపాదించిన దర్శకుడు ముదస్సర్ కు వెన్నులో చలి మొదలైంది. ఈసారి షూటింగ్ కేన్సిల్ అయితే మళ్లీ ఆయన డేట్స్ సంపాదించడం కష్టమవుతుంది. ఇది గ్రహించిన గిటార్ సప్లయిర్స్ ఇక తెగించడమే సరైన మార్గమనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. నేరుగా ఫేమస్ స్టూడియోలోకి చెరబడి సల్మాన్ గిటార్ ను చిక్కబుచ్చుకుని ఆ ప్లేస్ లో షారూక్ గిటార్ ఉంచి అక్కడ్నించి ఉడాయించారు. షూటింగ్ కేన్సిల్ అయితే వచ్చే నష్టాన్ని భరించలేమనీ, అందుకోసమే అతి తక్కువ వ్యవధిలోనే తమకు వేరే గిటార్ సమకూర్చాలంటూ సప్లయిర్స్ ను కోరామనీ, అనుకున్నట్టుగానే గిటార్ తమ చేతికి రావడం తమను తేలిగ్గా ఊపిరి తీసుకునేలా చేసిందనీ ముదస్సర్ తెలిపారు. సల్మాన్ నుంచి గిటార్ ఎలా రాబట్టగలిగారని పట్టుబట్టి అడిగినప్పుడు
'సప్లయిర్లు సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడు సల్మాన్ గిటార్ వాయిస్తూ కనిపించారు.కొద్దిసేపటకి ఆయన గిటార్ పక్కన పెట్టి బయటకు వెళ్లడంతో సప్లయిర్లు ఏమాత్రం జాప్యం చేయకుండా దానిని సొంతం చేసుకుని ఆ ప్లేస్ లో షారూక్ గిటార్ ఉంచారు. నిజానికి సల్మాన్ తన సినిమాలో గిటార్ వాయించే సన్నివేశం ఉందో లేదో మాకు తెలియదు. కాకుంటే రెండూ రెడ్ గిటార్లే కావడంతో మార్చినట్టు గ్రహంచడం చాలా కష్టం' అంటూ ముదస్సర్ నవ్వేశారు. షారూక్ తో ప్రస్తుతం తీస్తున్న గిటార్ సాంగ్ సినిమాకే ప్రధాన హైలైట్ అవుతుందని కూడా ఆయన వివరించారు.