'పూరీజగన్ తో ప్రేమ అబద్ధం'
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, ఆమె బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ మధ్య కొద్దికాలంగా నడుస్తున్న ప్రేమాయణానికి ఈమధ్యనే తెరపడింది. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం అధ్యయన్ సుమన్ తండ్రి ఆదిత్య పంచోలికి ఇష్టం లేకపోవడం వల్లనే కంగనాకు అధ్యయన్ చెక్ పెట్టేశాడట. ఇదే క్రమంలో కంగనా టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తాజా చిత్రం 'ఏక్ నిరంజన్'లో ప్రభాస్ కు జోడిగా కంగనను ఎంపిక చేశారు. ప్రసుత్తం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఈ చిత్రం కోసం పూరీ కోటి రూపాయల రెమ్యునరేష్ కూడా కంగనాకు ఆఫర్ చేశారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా అధ్యయన్ సుమన్ కు దూరం కావడంతో పూరీ జగన్ కు కంగన దగ్గరైందనే వదంతులూ బాలీవుడ్ లో మొదలయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం వదంతులేనంటూ కంగన తన తాజా ఇంటర్వ్యూలో కొట్టిపారేసింది.
'అధ్యయన్ కు దూరమై కేవలం ఒక నెలరోజులే అయింది. మళ్లీ ప్రేమలో పడాలంటే అందుకు కొంత వ్యవధి కావాలి. అందుకు ప్రస్తుతం సిద్ధంగా లేను. అయినా ఒంటరిగా ఉండేవాళ్లంటే జనానికి ఎందుకింత ఆసక్తో అర్ధం కావడం లేదు. ఎవరెవరితోనే ముడిపెట్టేస్తుంటారు. అలాంటి వాళ్లకు సూటిగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మరో ఏడాది వరకూ ఎవరితోనూ డేటింగ్ చేయదలచుకోలేదు' అంటూ తెగేసి చెప్పింది కంగన. అధ్యయన్ తో విడిపోవడం గురించి ప్రస్తావించినప్పుడు..ప్రస్తుతం వ్యక్తిగత అనుబంధాల కంటే కెరీర్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు అధ్యయన్ చెప్పినప్పుడు మొదట్లో షాక్ తిన్నాననీ, అయితే స్థిమితంగా ఆలోచించినప్పుడు అతని ఆలోచనలో తప్పుపట్టేదేమీ తనకు కనిపించలేదనీ చెప్పుకొచ్చింది. అధ్యయన్ నిర్ణయం వెనుక అతని తండ్రి ప్రమేయం గురించి తాను వ్యాఖ్యనించదలుచుకోలేదని పేర్కొంది. అధ్యయన్ కు దూరమైన తర్వాత కేవలం ఒకేసారి తాము మాట్లాడుకున్నామనీ, ఆ తర్వాత మళ్లీ తమ మధ్య మాటల్లేవనీ తెలిపింది. ప్రస్తుతం కంగనా దుర్బాన్ వెళ్లడానికి సిద్ధమవుతోంది. అక్కడ అనీష్ బజ్మీ 'నో ప్లాబ్లం' షూటింగ్ లో ఆమె పాల్గొనవలసి అంది. 'కైట్స్', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' చిత్రాలతో పాటు కొత్తగా 'మను వెడ్స్ తను' అనే చిత్రానికి కూడా కంగన కమిట్ అయింది. ప్రస్తుతం తాను అనీష్ బజ్మీ 'నో ప్రాబ్లం' వర్క్ షాప్ లో బిజీగా ఉన్నాననీ, ఇందులో ప్రపంచంలో తనంత అందగత్తె లేదనుకునే ఓ మూగమ్మాయి పాత్రను పోషిస్తున్నాననీ, ఇందుకోసం ఇంట్లో కూడా రోజూ గంట సేపు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాననీ కంగన చెప్పుకొచ్చింది.
News Posted: 8 July, 2009
|