కలం పట్టిన కత్రినా!
అందం, అందుకు తగ్గ అభినయం కలిస్తే కత్రినా కైఫ్ అవుతుందని బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలే విడుదలైన 'న్యూయార్క్' చిత్రంలోని కత్రినా నటనకు వివిధ వర్గాల నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. కత్రినా ఇప్పుడు తనలో దాగున్న మరికొన్ని ప్రతిభాపాటవాలను కూడా బహిర్గతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమెలో ఓ మంచి రచయిత్రి, మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడని నిరూపించుకోనుంది.
కత్రినా ఇటీవల అమెరికాలో జరిగిన 'న్యూయార్క్' షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ప్రతిరోజూ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలు, అనుభవాలను నోట్స్ రాసుకుంది. సినిమాలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను రికార్డ్ కూడా చేసుకుని తన సొంత కెమెరాతో ఫోటోగ్రాఫ్ లు కూడా తీసుకుంది. కత్రినా రాసుకున్న నోట్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందనీ, సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలు అందులో ఉండబోతున్నాయనీ చెబుతున్నారు. ఆ విశేషాలను 'న్యూయార్క్ డైరీస్' పేరుతో పుస్తకరూపంలోకి తెచ్చేందుకు కూడా కత్రినా రెడీ అవుతోంది. ఈ పుస్తకంలో కత్రినా తీసిన పలు ఫోటోగ్రాఫ్ లు కూడా ఉండబోతున్నాయి. కత్రినా కలం బలం ఏమిటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సి ఉంటుంది. అన్నట్టు...కత్రినా ఈమధ్యనే ఓ ఫ్రెంచ్ సినిమా రైట్స్ కూడా తీసుకుని ఆ చిత్రం ద్వారా నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టాలనుకుంటోందట. గ్రేట్ గోయింగ్ కేట్...
News Posted: 9 July, 2009
|