'షార్ట్ కట్'కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనిల్ కపూర్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నటుడు, నిర్మాత అనిల్ కపూర్ సొంతంగా నిర్మించిన 'షార్ట్ కట్' చిత్రం రిలీజ్ కు అవరోధాలు తొలగిపోయాయి. ఈ చిత్రం టైటిల్ తనదేనంటూ కోర్టును ఆశ్రయించిన మరో నిర్మాత బి.ఎస్.భుల్లార్ కు 35 లక్షల రూపాయలు చెల్లించేందుకు అనిల్ కపూర్ అంగీకరించడంతో సినిమా విడుదలకు కోర్టు అనుమతించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీ శుక్రవారంనాడు 'షార్ట్ కట్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ ఖన్నా, అర్షద్ వార్షి, అమృతారావు తదితరులు ఈ చిత్రంలో నటించారు.
కొద్దికాలం క్రింతం ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనతో అనిల్ కపూర్ ను కలిసి స్క్రిప్టు అందజేశాననీ, ఆ సినిమాలో ఓ పాత్రను కూడా ఆయనకు ఆఫర్ చేశాననీ భుల్లార్ రెండు రోజుల క్రితమే కోర్టును ఆశ్రయించారు. 2005 సెప్టెంబర్ తాను 'షార్ట్ కట్' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాననీ, ఇప్పుడు ఆ టైటిల్ ను అనిల్ కపూర్ వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆయన కోర్టుకు తెలియజేశారు. ఈ విషయమై సమాధానం చెప్పాల్సిందిగా అనిల్ కపూర్ నిర్మాణ సంస్థకు కోర్టు మంగళవారంనాడు నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తాను 35 లక్షల రూపాయలు పరిహారంగా భుల్లార్ కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని జస్టిస్ రేవ చత్రపాల్ ముందుకు అనిల్ కపూర్ గురువారంనాడు అంగీకరించారు. దీంతో 'షార్ట్ కట్' విడుదలపై చివరి నిమిషంలో తలెత్తిన గందరగోళానికి తెరపడింది.
News Posted: 9 July, 2009
|