కమల్ 'స్టెప్' వెనక్కి?!
విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ లుగా అనుకున్నవి వెనుకబాట పట్టిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈమధ్యనే 'మరుద నాయగం' వెనక్కి వెళ్లిపోయింది. తాజాగా కమల్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ప్రచారం జరుగుతూ వచ్చిన '19 స్టెప్స్' చిత్రం కూడా సెట్స్ కు రాకుండానే ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్, ఆసిన్, జపనీస్ సూపర్ స్టార్ టడనోబు అసనో ప్రధాన పాత్రధారులుగా భరత్ బాల దర్శకత్వంలో వాల్డ్ డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని 50 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసింది. తమిళ, ఆంగ్ల, హిందీ, తమిళ, తెలుగు, జపనీస్ భాషల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం తొలి అడుగు పడకుండానే ఫుల్ స్టాప్ పడిపోయినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్, వాల్డ్ డిస్నీ నిర్మాతలకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు ఇందుకు కారణమనీ, దీంతో కమల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనీ అనధికార సమాచారం.
'గజనీ' చిత్రం బాలీవుడ్ లో కూడా పాపులరైన ఆసిన్ '19 స్టెప్స్' కోసం ఇప్పటికే 'కళరియల పట్టు' అనే కేరళ యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటోంది. ఈమధ్యనే శిక్షణ సందర్భంగా కాలుకు గాయమై ముంబైలో విశ్రాంతి కూడా తీసుకుంటోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఉన్న ఏకైక తమిళ చిత్రం కూడా ఇదే. అయితే ఈ చిత్రం నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారనే వార్త ఆసిన్ ను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. కమల్ ఎందుకు తప్పుకోవలసి వచ్చిందనే ప్రశ్నకు 'ఈ ప్రశ్న నన్ను కాదు...నిర్మాతలను అడిగితే మంచిది' అంటూ ఆసిన్ చెబుతోంది. కమల్-ఆసిన్ జంటను 'దశావతారం' తర్వాత మళ్లీ చూడాలనుకునే అభిమానులకు ఈ వార్త అశనిపాతం వంటిదే మరి...
News Posted: 11 July, 2009
|