జాక్సన్ స్మృతికి శృతి షో
మైఖేల్ జాక్సన్ మృతి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను శోఖసముద్రంలో ముంచెత్తింది. ఆయన స్మృత్యర్థం శ్రుతి కమల్ హాసన్ త్వరలోనే ఓ స్టేజ్ షోను చెన్నైలో నిర్వహించబోతోంది. కమల్ హాసన్-సారిక దంపతుల కుమార్తె అయిన శ్రుతి ఇప్పటికే సంగీతరంగంలో చిచ్చరపిడుగు అనిపించుకుంటూ ఇటీవల తొలి ఆల్బమ్ ను విడుదల చేసింది. 'ఎ వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా కమల్ హాసన్ తమిళ (ఉన్నైపోల్ ఒరువన్), తెలుగు (ఈనాడు) భాషల్లో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ద్వారా తొలిసారి సంగీత దర్శకురాలిగా పరిశ్రమకు పరిచయమవుతోంది. బాలీవుడ్ లో తొలిసారి హీరోయిన్ గా పరిచయమవుతున్న 'లక్' చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మైకేల్ జాక్సన్ పట్ల తనకున్న అభిమానాన్ని కూడా చాటుకుంటూ చైన్నైలో స్టేజ్ షో కోసం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 29న నెహ్రూ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. మైఖేల్ జాక్సన్ పాపులర్ సాంగ్స్ లో మూడింటికి శ్రుతి స్టేజ్ పై నర్తించనుంది కూడా.
శ్రుతి స్టేజ్ షో ను తిలకించేందుకు కమల్ హాసన్, ఎ.ఆర్.రెహమాన్ తో సహా పలువురు టాప్ సెలబ్రెట్రీలు పాల్గొనబోతున్నారు. ఈ ఈవెంట్ ను కనీవినీ ఎరుగుని రీతిలో గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో శ్రుతి సంప్రదింపులు జరుపుతున్నారు. జాక్సన్ మరణానంతరం ఆయన స్మృత్యర్థం జరుగుతున్న తొలి స్టేజ్ షో ఇదే కావడం, ఆ క్రెడిట్ శ్రుతి దక్కించుకోనుండటం విశేషం.
News Posted: 11 July, 2009
|