'కంబఖ్త్'కు వారంలో 100 కోట్లు
అక్షయ్ కుమార్, కరీనాకపూర్ జంటగా షబీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియడ్ వాలా నిర్మించిన 'కంబఖ్త్ ఇష్క్' చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలివారంలోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది ఇంతవరకూ బాలీవుడ్ లో విడుదలైన చిత్రాల్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది. తొలివారం ఇండియాలో 70 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఓవర్ సీస్ కలెక్షన్లు 21 కోట్లకు చేరుకున్నాయి. మ్యూజిక్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వంటి వివిధ మార్గాల ద్వారా మరో 10 కోట్ల ఆదాయం నిర్మాతకు లభించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని షబీర్ ఖాన్ దర్శకత్వంలో 60 కోట్ల బడ్జెట్ తో నడియడ్ వాలా నిర్మించారు. అక్షయ్, కరీనాతో పాటు అఫ్తాబ్ శివదాసాని, అమృతా అరోరా తదితరులు నటించిన ఈ చిత్రంలో డెనిస్ రిచర్డ్స్ , బ్రాండన్ రూత్, స్విల్వస్టర్ స్టాలోన్ వంటి హాలీవుడ్ నటులు ప్రత్యేక పాత్రలు పోషించారు.
ఇండియాలోని అన్నిచోట్ల ఈ చిత్రం 95 నుంచి 100 శాతం ఓపినింగ్స్ రాబట్టుకుందనీ, రెండో వారంలోనూ 70 శాతానికి పైగా ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడుతున్నాయనీ ఎరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కు చెందిన నందు అహుజ తెలిపారు. మరోవైపు ఓవర్ సీస్ మార్కెట్ లో 'కంబఖ్త్ ఇష్క్' విజయఢంకా మోగిస్తోందని యూరప్, ఆఫ్రికాలలో ఎరోస్ ఎంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధి ప్రణబ్ కపాడియా తెలిపారు. ముఖ్యంగా ప్రధాన మార్కెట్లయిన అమెరికా, గల్ఫ్ స్టేట్ లు, ఆస్ట్రేలియా, ఫిజి, పాకిస్తాన్ లలో తొలివారం బాక్సాఫీస్ రిజల్ట్ అద్భుతంగా ఉందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో పాటు అంతర్జాతీయ స్టార్ లు ఇందులో నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని అన్నారు.
News Posted: 13 July, 2009
|