మేకప్ వేసుకుంటున్న వర్మ
రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఆయన సృష్టించిన సంచనాలు గుర్తుకు వస్తాయి. 'సత్య', 'రంగీలా' 'సర్కార్' వంటి ఎన్నో ట్రెండ్ సెట్టర్స్ ను అందించిన వర్మ అనేక మంది కొత్త తారలను పరిచయం చేసి వారికి గాడ్ ఫాదర్ గా నిలిచారు. ఫ్యాక్టరీ బ్యానర్ పై వరుస చిత్రాల నిర్మాణంలోనూ ముందుంటున్నారు. ప్రస్తుతం ఆయన తీసిన 'రణ్', 'అజ్ఞాత్' (తెలుగులో 'అరణ్యం') చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తికరంగా ఇంతవరకూ కెమెరా వెనకే ఉండి సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు తొలిసారి ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు కూడా రాబోతున్నారు. నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. వర్మను నటుడిగా పరిచయం చేసే అవకాశాన్ని దర్శకుడు అదీప్ సింగ్ దక్కించుకున్నారు. 'ముఝే రామ్ జీ సే మిల్నా హై' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.
పరిశ్రమలోని లోని చీకటి కోణాలను స్పృశిస్తూ ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే వారు ఎలాంటి వంచనలకు గురవుతున్నారనేది ఈ చిత్రంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. బాలీవుడ్ లో ఒక స్థాయికి చేరుకునేందుకు తాను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడో తెలియజెప్పే పాత్రలో వర్మ కనిపించబోతున్నారు. స్టోరీలైన్ చూస్తుంటే...నిన్నమొన్నే తెలుగులో రవితేజ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'నేనింతే' చిత్రానికి రీమేక్ కావచ్చని అనిపించడం లేదూ?!
News Posted: 14 July, 2009
|