మరో ప్రియుడితో కంగన?
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కంగనా రనౌత్ కు ఈమధ్యనే ఆమె చిరకాల బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ గుడ్ బై కొట్టేశాడు. అందరికీ తెలిసిన చాలా పాత విషయమిది. అధ్యయన్ కు దూరమైన కంగన తనకు టాలీవుడ్ లో 'ఏక్ నిరంజన్' చిత్రంతో తొలి అవకాశమిచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తో ఫ్రెష్ గా డేటింగ్ మొదలుపెట్టేసిందంటూ వారం క్రితం పుకార్లు షికారు చేశాయి. కంగనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వార్తలను ఖండించింది. 'అధ్యయన్ కు దూరమై నెలరోజులు కూడా కాలేదు. నేను స్విచ్చాఫ్, స్విచ్చాన్ రకం కాదు. అయినా నేను ఒంటరిగా ఉంటే జనాలకు ఎందుకింత కుళ్లు? ఇలాంటి వాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. మరో ఏడాది వరకూ ఎవరితోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదు' అంటూ కంగనా తెగేసి చెప్పింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి కాలేదు. తాజాగా మరో దర్శకుడు అనురాగ్ బసు వైపు కంగనా షిష్ట్ అయిందనీ, ఆయన సహచర్యంలోనే తన విలువైన సమయాన్ని వెచ్చిస్తోందంటూ బాలీవుడ్ లో కొత్త వదంతులు మొదలయ్యాయి.
'గాంగ్ స్టర్' తర్వాత అనురాగ్ బసు చిత్రాలన్నింటిలోనూ కంగనా పనిచేసిందనీ, 'కైట్స్' చిత్రం అనంతరం ఈ ఇద్దరి మధ్యా అనుబంధం మరింత బలపడిందనీ బాలీవుడ్ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. ఈ సినిమా సెట్స్ లోనూ కంగన, అనురాగ్ గంటల తరబడి ముచ్చటించుకుంటూ ఎంతో సరదాగా కనిపించేవారనీ, ఇద్దరూ కలిసే డిన్నర్లు చేసేవారనీ వారి కథనం. మరి తాజా కథనాలను కంగన ఖండిస్తుందో, బసుపై తన అనురాగాన్ని కంటిన్యూ చేస్తుందో చూడాలి...
News Posted: 14 July, 2009
|